పటాన్చెరు, జూన్ 13: జూన్ అంటేనే పేద, మధ్య తరగతి జీవుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంతో పాటు వానకాలం సాగు పనులు షురూ కావడంతో ప్రతి ఒక్కరూ డబ్బుల వేటలో నిమగ్నమయ్యారు. పిల్లలను విద్యాసంస్థల్లో చేర్పించడానికి తల్లిదండ్రులకు ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు ఈ ఏడాది భారీగా ఫీజులు పెంచడంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతున్నది. వ్యవసాయ పెట్టుబడులకు రైతు కుటుంబాలకు డబ్బులు అవసరం. దీంతో రైతులు, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు, సామాన్యులు, అప్పులు చేస్తున్నారు. రైతులు పంటలు సాగు చేసేందుకు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలి.
పిల్లలను పాఠశాలకు పంపించేందుకు పుస్తకాలు, యునిఫామ్స్, బూట్లు, క్యారేజ్ బాక్సులు, పెన్సిళ్లు, స్కూల్ బ్యాగులు, నోటు బుక్లు, పెన్నులు కొనుగోలు చేయాలి. ఆటోలు, బస్సుల చార్జీలు ముందుగానే చెల్లించాలి. విద్యార్థుల అడ్మిషన్ ఫీజులు సైతం గతేడాది కంటే ఈ ఏడాది అధికంగా పెంచడంతో భారం పెరిగిపోయింది. ఇంటర్, ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు వారు చదివే కళాశాలలను బట్టి ఒక్కొక్కరికి హాస్టల్ ఫీజుకు రూ. 3.50 లక్షల వరకు చెల్లించాల్సి వస్తున్నది. నీట్, ఎంసెట్, జేఈఈ, వాటికి మరింత అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. సామాన్యులు, చిరుద్యోగులకు, కార్మికులకు, కూలీలకు భారంగా మారింది.
ఫీజులు నియంత్రణ చేస్తామని ప్రతి ఏడాది సర్కార్ ప్రకటిస్తున్నా అమలు కావడం లేదు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులు వసూలుపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సామాన్యులకు విద్యాభారం కాకుండా చూడాలని డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. కొన్ని పాఠశాలలు ప్రభుత్వ అనుమతి లేకుండా సాగుతున్నా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభం రోజునే ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు ఘటనలు వెలుగుచూశాయి.
కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు అనుమతి ఒకచోట తీసుకుని మరోచోట నడిపిస్తున్నారు. ఫిర్యాదు చేస్తేనే విద్యాశాఖ అధికారులు స్పందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పటాన్చెరు ప్రాంతం హైదరాబాద్ సమీపంలో ఉండడంతో ఓఆర్ఆర్ సమీపంలో, పటాన్చెరు, అమీన్పూర్ ప్రాంతంలో వందల ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశారు. అక్కడ కనీస సౌకర్యలు లేకపోయినా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
జూన్ అంటేనే సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో ఫీజుల భయం పట్టుకుంది. ఫీజులు, పుస్తకాలు యూనిఫాంతో పాటు అన్ని ఖర్చులు ఒకేసారి రావడంతో ఆర్థికభారం పడుతున్నది. నర్సరీ నుంచి పదో తరగతి చదుకుతున్న విద్యార్థులకు అధికంగా ఫీజులు చెల్లించే పరిస్థితి ఉంది. ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబంలో రూ. 50 వేల నుంచి రూ. 75 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తున్నది. నర్సరీలో అడ్మిషన్ ఫీజులు రూ. 25 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు.
ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు నేరుగా పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం అమ్మకాలు చేస్తున్నా చర్యలు లేవు . బయట షాపుల్లో కొనుగోలు చేయకుండా వారే పాఠశాలలో అమ్మకాలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పాఠశాల బస్సులకు ముందుగానే ఫీజులు తీసుకుంటున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పేద, మధ్య తరగతి, సామాన్యులు కష్ట్టపడి సంపాదించిన మొత్తం ఫీజుల రూపంతో ప్రైవేట్ పాఠశాలలకు చెల్లించాల్సి వస్తున్నది.
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో అన్నదాతలు విత్తనాలు వేసేందుకు విత్తనాలు, ఎరువులు, ట్రాక్టరు కోసం డబ్బులు అవసరం. ఎకరం భూమిలో విత్తనం వేసేందుకు రూ. 10 వేల వరకు పెట్టుబడులు అవుతున్నాయి. చిన్న, సన్నకారు రైతులకు ఐదెకరాల వరకు భూమి ఉంటుంది. దీంతో ప్రతి రైతు వాన కాలం సీజన్లో రూ. 50 వేల వరకు ఖర్చు చేస్తారు. విద్యార్ధుల ఫీజులు, పంట సాగు కోసం రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు.
ఖర్చులు పెరిగిపోవడంతో రైతులు ఎక్కువగా వాణిజ్య పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో రైతులు పశువుల ఎరువులతో చిరుధాన్యాల పంటలు సాగు చేసేవారు. ప్రస్తుతం ఖర్చులు పెరిగిపోవడం వాణిజ్య పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. డీజిల్ ధర పెరిగిపోవడంతో రైతులకు భారంగా మారింది. ఎక్కువ మంది రైతులు ట్రాక్టరు సహాయంతో వ్యవసాయం చేస్తున్నారు. రైతుభరోసా రాకపోవడంతో అన్నదాతలు పంట పెట్టుబడులకు అప్పులు చేయాల్సి పరిస్థితి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలి. ప్రతి ఏడాది ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు భారీగా ఫీజులు పెంచుతున్నాయి. పటాన్చెరు ప్రాంతంలో కార్మికులకు జీతాలు తక్కువగా ఉండడంతో పిల్లల చదువుల కోసం అప్పులు చేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వ బడులపై నమ్మకం లేక నాతో పాటు చాలామంది పిల్లలను భారమైనా ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఫీజులు పెరిగిపోవడంతో సామాన్యులు అప్పులు చేయడం, ఉన్న భూములు అమ్మి పిల్లలను చదివించాల్సి వస్తున్నది. – సుభాష్, పటాన్చెరు
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచినా విద్యాశాఖ చర్యలు తీసుకోవడం లేదు. ఫీజులు నియంత్రణకు కఠినంగా వ్యవహరించాలి. పేద, మధ్య తరగతి, సామాన్యులు తమ పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రైవేట్ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేకపోయినా ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజులు నియంత్రణకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి. సర్కారు బడులను బలోపేతం చేయాలి.
– ఐలాపూర్ మాణిక్యాదవ్, పటాన్చెరు