సంగారెడ్డి, మార్చి 5(నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సంగారెడ్డి జిల్లా వాసులకు నిరాశను మిగిల్చింది. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ప్రధాని మోదీ జిల్లాకు ఎలాంటి వరాలు ప్రకటించలేదు. దీంతో ప్రజలతో పాటు బీజేపీ శ్రేణులు సైతం నిరాశకు గురయ్యాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మోదీ వరాలు కురిపించి పార్టీ గెలుపునకు బాటలు వేస్తారని బీజేపీ శ్రేణులు భావించాయి. మోదీ ఎలాంటి వరాలు ప్రకటించక పోవటంతో నేతలు నిరాశకు గురయ్యారు. పటాన్చెరు మండలం పటేల్‌గూడ సమీపంలోని ఎల్లంకి ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో మంగళవారం నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రధాని వర్చువల్‌గా రూ.7200 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కంది-రాంసాన్పల్లి జాతీయ రహదారి విస్తరణ పనులను జాతికి అంకితం చేశారు. రూ.1298 కోట్లతో చేపట్టనున్న సంగారెడ్డి చౌరస్తా-మదీనగూడ జాతీయ రహదారి ఆరు లేన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన సమయంలో ఎక్కడా జిల్లాకు వరాలు కురిపించలేదు. జిల్లా అభివృద్ధ్దికి నిధులు ప్రకటించలేదు.
జహీరాబాద్ నిమ్జ్‌లో మౌలిక వసతుల కల్పన, పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం నిధులు కేటాయించాల్సి ఉంది. మోదీ నిమ్జ్‌కు నిధుల కేటాయింపు, కొత్త పరిశ్రమల ఏర్పాటుపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. సంగారెడ్డి మీదుగా కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. పటాన్చెరు సమీపంలోని నాగుపల్లి నుంచి సంగారెడ్డి-జోగిపేట మీదుగా కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. ఈ రైల్వేలైన్‌కు సర్వే పనులు చేపట్టేందుకు రైల్వేశాఖ సుముఖత వ్యక్తం చేసింది. దీనిపై ప్రధాని ప్రకటన చేస్తారని ప్రజలు ఆశించారు. అయితే నిరాశే మిగిలింది. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైల్ విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపైనా మోదీ ఎలాంటి ప్రకటన చేయలేదు. సంగారెడ్డి జిల్లాలో ఐఐఎం లేదా ఇతర కేంద్ర విద్యా సంస్థ, నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. వీటిపైనా ప్రధాని ఎలాంటి ప్రకటన చేయలేదు. బహిరంగ సభలోనూ సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ప్రధాని ఎలాంటి హామీలు, భరోసా ఇవ్వలేదు.
ప్రధాని పర్యటనలో
ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్న అధికార కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులకు చోటుదక్కక పోవటం చర్చనీయాంశమైం ది. ప్రధాని పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో ఇటీవలే బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, సంగారెడ్డి ఎమ్మె ల్యే చింతా ప్రభాకర్‌కు అవకాశం దక్కలేదు. అధికారులు ఎంపీ బీబీపాటిల్, చిం తా ప్రభాకర్‌కు ఆహ్వానం పలకలేదని తెలుస్తోంది. ఎంపీ బీబీ పాటిల్ ప్రధాని మోదీ పాల్గొన్న బహిరంగ సభకు హాజరయ్యారు. కానీ, అధికార కార్యక్రమంలో పాల్గొనక పోవడం గమనార్హం. మదీనగూడ-సంగారెడ్డి చౌరస్తా ఆరులేన్ల రహదారి విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేశా రు. ఈ రహదారి విస్తరణ పనులు పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో జరుగనున్నాయి. రెండు నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మహిపాల్‌రెడ్డికి ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని సమాచారం.