సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 29 : దేశంలో కలవ రపెడుతున్న ఘటనలపై కవులు, రచయితలు మేలుకోవాలని ప్రముఖ సాహితీవేత్త, ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకుడు కె.శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో మంజీరా రచయితల సంఘం 38వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ముందుగా మరసం జెండాను అధ్యక్షుడు రంగాచారి ఆవిష్కరించారు. ఇటీవల అమరులైన కవులు, రచయితలకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. అనంతరం పలువురు కవులు రాసిన పుస్తకాలను ఆవిష్కరించారు.
ప్రారంభ ఉపన్యాసం చేసిన కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలో రాజ్యాంగ నైతిక విలువలు పాటించడం లేదన్నారు. విద్వేషాలు పెరుగుతున్న పరిస్థితుల్లో ఆధునిక భారతాన్ని నిర్మించడం అనివార్యమన్నారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ అస్తిత్వ వాసనలే లేవన్నారు. తెలంగాణ ఆత్మగౌరం కోసం జరిగిన ప్రాణ త్యాగాలకు విలువ ఉండాలన్నారు. ఇప్పటికీ రెండు తెలుగు రాష్ర్టాల్లో అంతరాలు ఉన్నాయని, సమస్యల మూలాలను శోధించి పరిష్కారాలను వెతకాలన్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో తెలంగాణ తనం ఉండాలని కోరారు.
అవాంఛనీయ పరిస్థితులు కమ్ముకుంటున్న నేపథ్యంలో కవులు, రచయితలు మేలుకోవాలని సూచించారు. సాహిత్యంలో వ్యక్తీకరణ, సృజనాత్మకత బాగున్నప్పటికీ వస్తు దారిద్యం ఉందన్నారు. భయం లేని పాలకులు అన్నిరకాల చైతన్యాన్ని హరిస్తారని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమానికి పాలకులు భయపడాల్సిన పరిస్థితులు తీసుకురావాలని సూచించారు. తెలంగాణ ఆత్మ మంజీరా, మూసీ లాంటి ఉపనదుల్లో ఉందన్నారు. మరసం ఉపనదిగా ప్రారంభమై, మహానదిగా పురోగమిస్తోందని తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ కాంక్షను జ్వలింపజేసిన మంజీరా రచయితల సంఘం, ఇప్పుడు మరింత బాధ్యతగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పురోగమించాలన్నారు.ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ రచించిన జయ జయహే తెలంగాణ పాటల పుస్తకం, మరసం కవులు రచించిన జోట పాటలు కవితా సంకలనం, సిద్దంకి యాదగిరి రచించిన మూడు గుడిసెల పల్లె పుస్తకాన్ని అతిథులు కె.శ్రీనివాస్, నందిని సిధా రెడ్డి, దేశపత్రి శ్రీనివాస్, విరాహత్ అలీ ఆవిష్కరించారు.సిద్దిపేట టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు పరమేశ్వర్,టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, తోట అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మరసం తనకు కన్నతల్లి లాంటిదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మరసం ఎంతో మందికి పోరాట స్ఫూర్తిని కలిగించిందన్నారు. ఒక నిశ్శబ్ధ కాలాన్ని ఛేదించేందుకు ధైర్యం చేసింది మరసం అన్నారు. ఒక కళాకారునిగా తెలంగాణ ఆట పాటకు ధూం ధాం అనే ఆలోచన కలిగించింది మంజీరా రచయితల సంఘం అన్నారు. తీరొక్క పూలను తీసుకొచ్చి బతుకమ్మను పేర్చిన మాదిరిగా, ఎందరో కవులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి మరసం శ్రీకారం చుట్టిందన్నారు.
– మాజీ ఎమ్మెల్యే రసమయి బాలికిషన్
నాడు తెలంగాణ ప్రజల వీరోచిత లక్ష్యం కోసం, ప్రత్యేక రాష్ట్ర ఉద్య మాన్ని మంజీరా రచయితల సంఘం ముందే పసిగట్టి ప్రారంభించిందని బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో మంజీరా రచయితల సంఘం గొప్ప పాత్ర పోషించిందన్నారు. మూసీ అభివృద్ధి పేరిట ప్రజలను నిరాశ్రయులను చేసే కుట్ర జరుగుతున్నదని, వీటన్నింటినీ మనసులో పెట్టుకొని మరసం తన పదును పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
– కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్