కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. రైతులకు కునుకు కరువైంది. కరెంట్ కోసం రాత్రంతా పొలాల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తున్నది. మడిమడికి పైపుల ద్వారా నీళ్లు తడపాల్సి వస్తున్నది. వచ్చి పోయే కరెంట్‌తో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్ మోటర్లు తరుచూ కాలుతున్నాయి.లోవోల్టేజీ సమస్యతో సతమతమవుతున్నారు.
ఒక్కో రైతు వ్యవసాయ బావి మోటరు ఇప్పటికే రెండు మూడుసార్లు కాలిపోయాయి. మోటరు దించడానికి, పైకి తీయడానికి, రిపేరు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇంతచేసినా రైతుకు పెట్టుబడి మేర డబ్బులు వస్తాయన్న గ్యారెంటీ లేకుండా పోయింది. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల కరెంట్‌తో రైతులు హ్యాపీగా వ్యవసాయం చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది.
సిద్దిపేట, మార్చి 12( నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కరెంట్ కష్టాలు రైతులను వేధిస్తున్నాయి. వచ్చి పోయే కరెంట్‌తో వ్యవసాయ బావుల వద్ద మోటర్లు, బోర్ మోటర్లు మాటిమాటికి కాలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. రైతులే కాలిన ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ ఉప కేంద్రాలకు తీసుకుపోయి బాగు చేయిస్తున్నారు. రాత్రినక పగలనక కరెం ట్ కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో నాటి పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ 15 నెలల పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కరెంట్ కష్టాలు, మరోవైపు అడుగంటిన భూగర్భజలాలతో పంటలకు నీళ్లు అందించలేక రైతులు దిగులు చెందుతున్నారు.
యాసంగిలో వేసిన వరి పంట ప్రస్తుతం పొట్టదశలో ఉన్నది. ఈ సమయంలో పంటకు తగినంత నీళ్లు అవసరం.తరచూ మోటర్లు కాలుతుండడంతో నీళ్లందక పంటలు ఎండిపోతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్నిరకాల విద్యుత్ కనెక్షన్లు 17,51,603 ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 34.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతున్నది. సిద్దిపేట జిల్లాలో అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లు 5,75,928 ఉన్నాయి. వీటిలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 1,73,530, గృహ 3,53,346, పరిశ్రమలు 3,850, మిగతా 45,202 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో రోజుకు 11.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతున్నది.
మెదక్ జిల్లాలో అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లు 3,55,093 ఉన్నాయి. వీటిలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 1,09, 152, గృహ విద్యుత్ కనెక్షన్లు 2,09,174, పరిశ్రమలు 2,411, మిగతా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మెదక్ జిల్లాలో నిత్యం 8 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతున్నది. సంగారెడ్డి జిల్లాలో గృహ విద్యుత్ కనెక్షన్లు 6,14,652, వాణిజ్య 76,938, పరిశ్రమలు 5,504, వ్యవసాయం 1,06,061, ఇతర 17,427 కనెక్షన్లు ఉ న్నాయి. జిలాల్లో అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లు 8,20, 582 ఉన్నాయి. సంగారెడ్డిలో జిల్లాలో రోజూ 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతున్నది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో లోవోల్టేజీ సమస్యతో నిత్యం వందల కొద్ది వ్యవసాయ మోటర్లు కాలుతున్నాయి. కరెంట్ ఎప్పుడు వస్తుందో…ఎప్పుడు పోతుందో తెలియక రైతులు పొలాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తున్నది. అనధికార కరెంట్ కోతలు విధిస్తున్నారు, రాత్రివేళ ఇష్టం వచ్చినట్లు కరెంట్ ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ బావుల వద్ద ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ పోతే లైన్ ఇన్సెక్టర్, విద్యుత్ సిబ్బంది సకాలం లో స్పందించడం లేదని, తామే సరిచేసుకుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరుబావుల మోట ర్లు కాలిపోతుండడంతో రిపేరు షాపులకు గిరాకీ ఏర్పడింది. రైతులు రిపేర్ షాప్‌ల వద్ద క్యూకడుతున్నారు.