గజ్వేల్, నవంబర్ 2: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న రోడ్లపై వాహనదారులు ప్రయాణించాలంటేనే జంకుతున్నారు. సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారిపై ఏర్పడ్డ గుంతలను పూడ్చకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదకరంగా మారిన రోడ్డుపై నిత్యం వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు రాకపోకలు సాగిస్తుంటారు. జిల్లాలో వంటిమామిడి వద్ద ప్రారంభమైన రాజీవ్ రహదారి చిన్నకోడూర్ మండలం వరకు ఉంటుంది. నిత్యం ఇదే మార్గంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రయాణిస్తుంటారు.
వర్గల్ మండలం గౌరారం సమీపంలో కల్వర్టు వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజీవ్ రహదారి పలుచోట్ల కోతకు గురైంది. రోడ్డు పక్కనే కోతకు గురవడంతో పెద్ద గోతిలా ఏర్పడింది. ఈ ప్రాంతానికి కొద్ది దూరంలోనే వాహనదారులు మక్క కంకులు, సీతాఫలాలు, జామకాయలు కొనుగోలు చేయడానికి ఆగుతుంటారు. కొద్ది దూరంలో ఉన్న హోటల్లో భోజనం, టిఫిన్ చేసేందుకు నిత్యం సిద్దిపేట నుంచి వచ్చే వాహనాలు ఆగుతుంటాయి. రాత్రి సమయంలో కోతకు గురైన ప్రాంతంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు స్పందించి కోతకు గురైన ప్రాంతాన్ని మట్టితో నింపాలని ప్రయాణికులు కోరుతున్నారు.