రాయపోల్, ఆగస్టు 11 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ఎల్కల్ నుంచి మక్తామాసాన్పల్లికి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. చిన్నపాటి వర్షానికే రోడ్డు చిత్తడిగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. 20 ఏండ్ల నుంచి రోడ్డుకు మరమ్మతులు చేయక ప్రయాణికులు,గ్రామస్తులు పడరాని పాట్లు పడుతున్నారు. అడుగడుగునా గుంతలు పడటంతో ఎల్కల్ నుంచి గజ్వేల్‌కు వెళ్లాలంటే ప్రయాణికులు,గ్రామస్తులు అనేక అవస్థలు పడుతున్నారు.
రోడ్డుకు మరమ్మతులు చేయిస్తామని గతంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఆయా పార్టీల నాయకులు హామీలు ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఎల్కల్ గ్రామం నుంచి మక్తమాన్పల్లి వరకు నిత్యం కాలినడకన వెళ్లి అక్కడి నుంచి బస్సులో పోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని అధికారులు, ప్రజాప్రతినిధులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్కల్ నుంచి మక్తామాసాన్పల్లికి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. కొన్నేండ్ల నుంచి రోడ్డు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డు గుంతలమయంగా మారడంతో బస్సులు రావడం లేదు. కాలినడకన లేదా ఆటోల్లో ఇతర గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారులు.ప్రజాప్రతినిధులు రోడ్డుకు మరమ్మతులు చేయించాలి.
-జాల రవీందర్, ఎల్కల్ గ్రామం, రాయపోల్ మండలం, సిద్దిపేట జిల్లా