సంగారెడ్డి జనవరి 20(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో గ్రామసభల నిర్వహణపై అధికారుల్లో గుబులు నెలకొంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తున్నది. గ్రామాల్లోని ప్రజలు గ్రామసభలను అడ్డుకుంటారని, అధికారులను నిలదీస్తారన్న ఆందోళన అధికారయంత్రాంగంలో నెలకొన్నది. జిల్లాలో మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు గ్రామసభలు నిర్వహించనున్నారు. గ్రామసభల నిర్వహణ జిల్లా యం త్రాంగానికి సవాలుగా మారింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో కోతలకు, వడపోతలకు కాంగ్రెస్ సర్కార్ ప్రాధాన్యత ఇవ్వటమే ఇందుకు కారణం. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
ఇందుకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించింది. లబ్ధిదారుల ఎంపికకు కొత్తగా పలు నిబంధనలు విధించింది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి జిల్లాలో అర్హులైన వారందరికీ పథకాలు వర్తించే అవకాశాలు కనిపించటం లేదు. దీంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తుంది. అయితే మంగళవారం నుంచి గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వ పథకాలకు ఎంపికైన లబ్ధిదారుల వివరాలను అధికారులు వెల్లడించనున్నారు. ప్రభుత్వ పథకాలకు ఎంపిక కానీ లబ్ధిదారులు గ్రామసభల్లో అధికారులను నిలదీయటంతో పాటు గ్రామసభలను అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు రోజులపాటు సాగే గ్రామసభల నిర్వహణ అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఎలాగైనా గ్రామసభలు విజయవంతం చేయాలని, ఇందుకు అవసరమైతే పోలీసుల భద్రత తీసుకోవాలని జిల్లా యం త్రాంగం యోచిస్తున్నట్లు తెలుస్తున్నది.
లబ్ధిదారుల ఎంపికపై సర్వత్రా అసంతృప్తి
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుంచి అమలు చేయనున్న వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తున్నది. ఎన్నికలకు ముందు అందరికీ ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొంతమందికి మాత్రమే పథకాలను వర్తింపజేయటంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. సంగారెడ్డి జిల్లాలో ప్రజలు ఎంతోకాలంగా కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. కొత్తరేషన్ కార్డుల కోసం మీసేవ కేంద్రాల్లో 74,995 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రజాపాలనలో 26,158 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణనలో పెద్ద సంఖ్యలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ప్రభుత్వం కులగణన ఆధారంగా అర్హులైన వారికి రేషన్‌కార్డుల జారీ చేసే అవకాశం ఉండటంతో 70శాతం మందికి రేషన్ కార్డులు రాకపోవచ్చు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్‌కార్డుల విషయమై గ్రామసభలో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ హయాంలో జిల్లాలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ప్రతిఏటా రూ.12వేలు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అయ్యేది. రైతుబంధు పథకం ప్రారంభమైన నాటి నుంచి 2023 వరకు 3.24 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,272 కోట్ల పెట్టుబడి సాయం డబ్బులు ప్రభుత్వం జమ చేసింది. కాగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పది ఎకరాల్లోపు భూమి ఉన్నవారికి, సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతుభరోసా ఇస్తామని నిబంధనలను విధిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.
జిల్లాలో సాగుకు యోగ్యంకాని భూముల గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. ఇప్పటి వరకు 5వేల ఎకరాలు సాగుకు యోగ్యంకాని భూమి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వం రైతుభరోసా కొంతమందికి అమలు చేస్తుందని రైతుల్లో ఆందోళన నెలకొంది. గ్రామసభల్లో ఈ విషయమై రైతులు అధికారులను నిలదీసే అవకాశం ఉంది. ఎన్నికల్లో వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేలు అందజేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ పథకం కింద భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇంటికి ఒక్కరికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతలుగా రూ.12వేలు ఇస్తామని చెబుతుంది. జిల్లాలో 20 పనిదినాలు పూర్తి చేసుకున్న కూలీలు 94వేల మంది ఉండగా వీరిలో వ్యవసాయ భూమిలేని కూలీలు 25వేల మంది ఉన్నారు.
జిల్లాలో కేవలం 28శాతం మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయభరోసా వర్తించనుంది. దీంతో మిగితా కూలీలు గ్రామసభల్లో అధికారులను ఇందిరమ్మ భరోసా లబ్ధిదారుల ఎంపికపై ప్రశ్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో నిరుపేదలైన వారంతా ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం పరిమితంగా అమలు చేయనుండటంతో పేదలు ఈ విషయమై గ్రామసభల్లో అధికారులను నిలదీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అధికారులు మాత్రమే ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతర ప్రక్రియగా చెబుతున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న గ్రామసభల్లో లబ్ధిదారుల వివరాలు వెల్లడిస్తామని, వాటిపై అభ్యంతరాలు ఉంటే ప్రజలు చెప్పవచ్చని, కొత్త పథకాల కోసం దరఖాస్తులు అధికారులకు సమర్పించవచ్చని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.