కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుల నియామకం వివాదాస్పదమవు తున్నది. కార్యనిర్వాహక మండలిలో అర్హత లేని వారికి చోటు కల్పించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా తొలగించిన వారిని, కోర్టులో కేసు ఎదుర్కొంటున్న వారికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో స్థానం కల్పించడంపై దుమారం లేపుతోంది. అదేవిధంగా తెలుగు విభాగంలో ఒప్పంద అధ్యాపకుడిగా పనిచేస్తున్న చిర్ర రాజు నియామకంపై ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఉద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు, మేధావులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిదీ, ఈయనది ఒకే సామాజికవర్గం కావడంతో పలు అనుమానాలకు తావిస్త్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హనుమకొండ చౌరస్తా, జూలై 7 : ఈనెల 4న కేయూ పాలకమండలిని 9 మంది సభ్యులతో నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం జీవో జారీ చేశారు. ఇందులో ముగ్గురు సభ్యుల నియామకం వివాదాస్పదంగా మారింది. ప్రిన్సిపాల్ కోటాలో యూనివర్సిటీ లా కాలేజీకి చెందిన డాక్టర్ ఎన్ సుదర్శన్, యూనివర్సిటీ టీచర్ కోటాలో కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ బొద్దిరెడ్డి రమను సభ్యులుగా నియమించారు. 2019లో జరిగిన 130వ పాలకమండలి సమావేశంలో ఈ ఇద్దరితోపాటు మరో 28 మంది నియామకాలు అక్రమమని, వీరిని ఉద్యోగం నుంచి తొలగించాలని తీర్మానం చేశారు. 2010లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకమైన వీరిపై డాక్టర్ వినతారెడ్డి కేసు వేయడంతో 2015లో పూర్తి పాలకమండలి ద్వారా రెండు నెలల్లో ఆమోదించుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో 2019లో ఈసీ సబ్ కమిటీ సమావేశమై వీరి నియామకాలు అక్రమమని తేల్చింది. ఈ తీర్మానాలను అదే సంవత్సరం పాలక మండలి సభ్యులు ఆమోదించారు.
పాలకమండలి వీరిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని పేరొన్నా కేయూ అధికారులు తొలగించకపోవడంతో డాక్టర్ వినతారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా అక్రమంగా నియామకమైన వీరిని ఎందుకు కొనసాగిస్తున్నారని కూడా ప్రశ్నించింది. అయినప్పటికీ కేయూ అధికారులు, ప్రభుత్వం వీరి తొలగింపుపై నిర్ణయం తీసుకోలేదు. హైకోర్టు ఉత్తర్వులను ధికరించారని మళ్లీ 2023లో కేసు వేయగా అప్పట్లో ఉన్నత విద్యా కార్య దర్శిగా ఉన్న వాకాటి కరుణ, ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి కోర్టుకు హాజరుకాక తప్పలేదు. అనేకమంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ ప్రొఫెసర్లు ఉండగా హైకోర్టులో కేసు ఎదురొంటున్న, పాలకమండలితో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం రద్దు కాబడిన జూనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పాలక మండలి సభ్యులుగా ప్రభుత్వం నియమించడంపై పలు అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఈ పాలక మండలిలో ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదని, రద్దు చేయాలని కూడా పలువురు ఇప్పటికే ఫిర్యాదులు చేశారు.
మరో సభ్యుడు చిర్ర రాజు కేయూలో తెలుగు విభాగంలో ఒప్పంద అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఇతడికి ఎమినెంట్ పర్సన్ కోటాలో సభ్యుడిగా నియమించడం కూడా వివాదాస్పదమైంది. చిర్ర రాజుకు కేయూ పాలకమండలిలో చోటు లభించడంపై ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్, ఉద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు, మేధావులు మండిపడుతున్నారు.
కాకతీయ యూనివర్సిటీలో 2010లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకమైన వారిపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు వేశా. 2019లో ఈసీ సబ్‌కమిటీ సమావేశమై వీరి నియామకాలు అక్రమమని తేల్చింది. వారి జీతాలు కూడా నిలిపివేయించాం. ఇప్పుడు వీరిని పాలకమండలి సభ్యులుగా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. పాలకమండలి వీళ్లను ఆమోదించలేదు. వీరి నియామకం చెల్లదు. మాకు జాబ్ రావాలని కోర్టుకు వెళ్లలేదు. అర్హులకు న్యాయం జరగాలి. అందుకోసమే మేం పోరాడుతున్నాం. అక్రమంగా నియామకమైన వారిని పాలకమండలిలో సభ్యులుగా తీసుకున్నారు. వెంటనే వారిని తొలగించాలి.