హుస్నాబాద్, జనవరి 24: హుస్నాబాద్ పట్టణ సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని గాంధీచౌక్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహా న్ని ఆవిష్కరించిన అనంతరం శివాజీనగర్‌లో ఏర్పా టు చేసిన ‘ఐ లవ్ హుస్నాబాద్’ ఎంబ్లమ్‌తోపాటు ఫౌంటేన్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ సుందరీకరణలో భాగం గా ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా, పర్యాటకంగా, విద్య, వైద్య రంగాల్లో ముందుంచేందుకు పాటుపడుతానని చెప్పారు. వచ్చే ఏడాదిలోపు పట్టణానికి రింగ్‌రోడ్డు నిర్మాణం జరిగేలా కృషి చేస్తానని, ప్రజల సహకారంతో హుస్నాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.
కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం, చౌటపల్లి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఆర్డీవో రామ్మూర్తి, కమిషనర్ మల్లికార్జున్‌గౌడ్, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.