మెదక్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : పోలింగ్ అధికారులు ఈవీఎంలను, పోలింగ్ మెటీరియల్‌ను చెక్‌లిస్ట్ ప్రకారం సరిచూసుకుని, తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా సూచించారు. బుధవారం మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ సిబ్బందికి, అధికారులకు ఆయన తగు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లి ప్రతి బస్సుకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేశామని, తిరిగి రిసెప్షన్ కేంద్రాలకు వచ్చిన తర్వాత క్లోజ్డ్ కంటైనర్ల ద్వారా స్ట్రాంగ్ రూమ్‌లకు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా తరలిస్తామన్నారు. పోలింగ్ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో తమకు కేటాయించిన కేంద్రాల్లోనే బస చేయాలని ఆదేశించారు. ఓటు గోప్యతకు అనుగుణంగా పోలింగ్ కేంద్రంలో కంపార్ట్మెంట్, సిబ్బంది ఏజెంట్లు కూర్చునే విధంగా సిట్టింగ్ ఏర్పాటు చేసుకొని అవసరమైన ఫారాలను సిద్ధం చేసుకొని ఉదయం 5.30 గంటలకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి క్లియర్ చేయాలని సూచించారు.
అనంతరం కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్‌ను సందర్శించి ఈ రెండు రోజులు అత్యంత కీలకమని ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నిశ్చితంగా పరిశీలిస్తూ ఓటింగ్ సరళికి సంబంధించి పుకార్లు, అసత్య వార్తలు ప్రసారమవుతుంటే, వెంటనే సంబంధిత అధికారులకు తెలుపుతూ వాటి నిలుపుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌కు సంబంధించి ఓటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించాలపని, ఎలాంటి చిన్న సంఘటన దృష్టికి వచ్చినా వెంటనే తెలపాలన్నారు. అనంతరం కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈసారి ప్రతి టేబుల్ దగ్గర ఓట్ల లెకింపును సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కౌంటింగ్ హాల్లో రౌండ్ వారీగా ఫలితాలను రిటర్నింగ్ అధికారి ప్రకటించేలా చూడాలని, పోలింగ్ ఏజెంట్లకు తగు వసతులు కల్పించాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి రౌండ్ వారీగా ఫలితాలను ఎప్పటికప్పుడు ఇకడ ఏర్పాటు చేసుకున్న మీడియా కేంద్రంలో పాత్రికేయులకు తెలియజేయాలన్నారు.