అల్లాదుర్గం, నవంబర్ 30 : అల్లాదుర్గం మండంలోని ఆయా గ్రామాల్లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండల వ్యాప్తంగా 75 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్‌కు అరగంట పాటు అంతరాయం ఏర్పడింది. సీతానగర్ గ్రామంలో అత్యధికంగా 93 శాతం పోలింగ్ జరిగింది.
టేక్మాల్, నవంబర్ 30 : మండలంలోని 37 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు, పోలీసుల సమక్షంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. టేక్మాల్ మండల వ్యాప్తంగా 84.29 శాతం పోలింగ్ నమోదు కాగా, ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం తర్వాత ఊపందుకున్నది. మండలంలోని 28755 ఓట్లకు గానూ 24329 ఓట్లు పోలయ్యాయి.అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, ఓటింగ్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. మండలంలో షాబాద్ నందు అత్యధికంగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా, టేక్మాల్‌లోని ఒక బూత్‌లో అత్యల్పంగా ఓటును వినియోగించుకున్నారు. తిరిగి సాయంత్రం ఓటింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను ఎన్నికల సిబ్బంది స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు.
పెద్దశంకరంపేట, నవంబర్30 : పెద్దశంకరంపేట మండలంలో గురువారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పేట మండలంలో 30084ఓట్లకు గానూ 25890 మంది ఓటర్లు తమ ఓట్యుక్కును వినియోగించుకోగా, 86.5 శాతం ఓటింగ్ నమోదైంది.
మంచి పాలకులను
ఓటు హక్కు వినియోగంతోనే మంచి పాలకులను ఎన్నుకోవచ్చు. రాజ్యాంగం కల్పించిన అతిముఖ్యమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. తాను మొదటిసారి మంచి పాలకుడిని ఎన్నుకోవాలని నా వంతు ఓటేశా. మొదటిసారి ఓటేసినందుకు చాలా హ్యాపీగా ఉంది.
ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు. నేను బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. తెలంగాణలో సాధారణ ఎన్నికలు ఉండడం వల్ల ఉద్యోగానికి సెలవు పెట్టి ఓటు వేసేందుకు మా సొంత గ్రామానికి వచ్చి ఓటేశా. ఓటు హక్కుతోనే మంచి పాలకులను ఎన్నుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఓటు హక్కును వినియోగించుకున్నా.
మొదటిసారి ఓటేసినందుకు సంతోషంగా ఉన్నది. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అధికారులు అవగాహన కల్పించడంతో ఓటరు నమోదు చేసుకున్నా. ఓటు అనే వజ్రాయుధంతో మంచి పాలకులను ఎన్నుకోవచ్చని, ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ఓటేశా.
మా అన్నదమ్ములిద్దరికీ ఒకేసారి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కలిగింది. మొదటిసారి ఓటేసినందుకు సంతోషంగా ఉన్నది. మా తల్లిదండ్రులు ఓటు హక్కు వినియోగించుకోవాలని తమను ప్రోత్సహించారు. ఓటు హక్కుతో మంచి పాలకులను ఎన్నుకోవచ్చు.