అల్లాదుర్గం, సెప్టెంబర్ 3: వాగులో చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు ప్రాణాలకు తెగించి కాపాడిన సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని షాబాద్తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాబాద్తండాకు చెంది న రమావత్నందు మంగళవారం ఉదయం చేపలు పట్టడానికి తండాకు సమీపంలోని గుండువాగుకు వెళ్లాడు. వాగుదాటుతున్న క్రమంలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. వాగులో కొట్టుకుపోతూ మధ్యలో పెద్దగుండురాయి తగలడంతో దాన్ని గట్టిగా పట్టుకొని ఆగిపోయాడు.
విషయం తెలుసుకున్న కొం దరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెం టనే స్పందించిన పోలీసులు క్విక్ రెస్పాన్స్ టీం(క్యూఆర్టీ) ఘటనా స్థలానికి చేరుకున్నది. టీం సభ్యులు మహేశ్, బండి శ్రీనివాస్, సురేశ్‌నాయక్, కృష్ణ, రమేశ్ కలిసి కల్వర్టు మధ్య వరకు వెళ్లి రమావత్నందుకు తాడు అందించారు. తాడు సాయంతో అతడిని వరద ప్రవాహం నుంచి బయటకు తీసుకొచ్చారు. వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన టీం సభ్యులను మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్ అభినందించారు.