సంగారెడ్డి జనవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నదని కలెక్టర్ శరత్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం కలెక్టరేట్లో జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. వ్యవసాయం, సాగునీటి రంగాలకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్నిరకాల భూసమస్యల పరిష్కారం కోసం ధరణి పోర్టల్‌ను ప్రారంభించారన్నారు. ఇందులో 1.06 లక్షల దరఖాస్తులు రాగా లక్ష వరకు పరిష్కరించినట్లు తెలిపారు. పాలనా సౌలభ్యం కోసం కొత్తగా నిజాంపేట మండలాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతుబంధు పథకంతో జిల్లాలో పది విడతల్లో 2,80,846 మంది రైతులకు రూ.3111 కోట్లు పెట్టుబడి సాయం అందజేశామన్నారు. రైతుబీమాతో 5962 మంది రైతు కుటుంబాలకు రూ.298.1 కోట్లు బీమా పరిహారం అందజేసినట్లు తెలిపారు.
సంగమేశ్వర, బసవేశ్వరకు రూ.4,427 కోట్ల నిధులు
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు రూ.4,427 కోట్ల నిధులు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు, బసవేశ్వరతో నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లోని 1.65 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనున్నదన్నారు. నారాయణఖేడ్‌లో కొత్త చెరువుల నిర్మాణానికి రూ.56.48 కోట్లు విడుదలైనట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు 19వ ప్యాకేజీ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధికి వందశాతం సబ్సిడీతో రూ.1.71 కోట్ల విలువ చేసే 2.74 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదిలినట్లు తెలిపారు. గొర్రెల పంపిణీ పథకంలో 18,754 మందికి యూనిట్లు పంపిణీ చేశామన్నారు.
ధాన్యం డబ్బు చెల్లింపులో ప్రథమ స్థానం
ధాన్యం డబ్బు చెల్లింపుల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. వానకాలంలో 277 కొనుగోలు కేంద్రాల్లో 35,850 మంది రైతుల నుంచి రూ.386.44 కోట్ల విలువ చేసే 18,75,936 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఆసరా పథకంతో జిల్లాలోని 1.62 లక్షల మందికి ప్రతి నెలా రూ.36 కోట్ల పింఛన్ అందజేస్తున్నామన్నారు. ఎస్‌హెచ్‌జీ మహిళలకు రూ.760 కోట్ల బ్యాంకు లిం కేజీ రుణాలు అందించి, రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో 36,500 మందికి రూ. 365.42 కోట్లు, షాదీముబారక్‌తో 9637 మందికి రూ.96.48 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. దళితబంధు పథకంలో 444 మందికి లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ఎస్టీ వార్షిక ప్రణాళికలో 322 మందికి రూ.3.67 కోట్లు, అంబేద్కర్ ఓవర్సీస్ పథకంలో 37 మందికి రూ.7.50 కోట్లు అందజేశామన్నారు.
జిల్లాకు సీఎం ప్రత్యేక నిధులు
జిల్లాలో అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూ.527 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. రూ.155 కోట్లతో బీటీ రోడ్లు, రూ.121 కోట్లతో పంచాయతీల్లో అభివృద్ధి పనులు, ఎనిమిది మున్సిపాలిటీల్లో రూ.250 కోట్లతో 939 పనులు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 743 క్రీడా ప్రాంగణాలు నిర్మించామన్నారు. రూ.1138 కోట్లతో మిషన్ భగీరథ పథకంలో 2,89,261 నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీరు అందజేస్తున్నట్లు తెలిపారు. ఎనిమిది మున్సిపాలిటీల్లో రూ.38.50 కోట్లతో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నామన్నారు. జిల్లాకు రూ.338.11 కోట్లతో 5920 డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా, 3318 నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. రూ.76 కోట్లతో నాలుగు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.
వైద్య రంగానికి పెద్దపీట
జిల్లాలో మెరుగైన వైద్యసేవలు అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్ర, ప్రాంతీయ దవాఖానల్లో కార్పొరేట్‌కు దీటుగా ఆధునాతన వైద్య పరికరాలతో ఖరీదైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. గ్యాస్ట్రియో, న్యూరోసర్జరీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్, రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలు ప్రారంభించినట్లు చెప్పారు. గర్భిణులకు టిఫా స్కాన్ మిషన్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. జిల్లాలో కొత్తగా 13 బస్తీ, 158 పల్లె దవాఖానలు ప్రారంభించామన్నారు. కొత్తగా 109 మంది మెడికల్ ఆఫీసర్లను నియమించామన్నారు. 150 ఎంబీబీఎస్ సీట్లతో సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభమైందన్నారు. రూ.30 కోట్లతో కాలేజీ మొదటి బ్లాక్, రూ.143 కోట్లతో ఆరు బ్లాకులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. రెండో విడత కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 854 వైద్య శిబిరాలు నిర్వహించి, 17.11 లక్షల మందికి కంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు. కొత్తగా రూ.20 లక్షల చొప్పున నిధులతో 20 హెల్త్‌సబ్ సెంటర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు.
మన ఊరు-మనబడికి రూ.210.16 కోట్లు
మన ఊరు-మనబడి కార్యక్రమంతో జిల్లాలో మొదటి విడతగా రూ.210.16 కోట్లతో 441 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇం టర్మీడియట్ ప్రారంభించి, 1030 మంది బాలిలకు విద్యను అందజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ మం జుశ్రీ జైపాల్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, అదనపు ఎస్పీ ఉషా విశ్వనాథ్, జిల్లా అధికారులు, డీఎస్పీ రవీందర్‌రెడ్డి, ఆర్డీవో నగేశ్, తహసీల్దార్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.