సంగారెడ్డి నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల వేళ సంగారెడ్డి జిల్లాలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు గట్టి షాక్‌లు తగులుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన సీనియర్ నాయకులు ఆ పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మం త్రి హరీశ్‌రావు ఎన్నికల వ్యూహాలు ఫలిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యం గా పనిచేస్తున్న మంత్రి హరీశ్‌రావు రాజకీయ ఎత్తుగడలకు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు చిత్తవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీల ముఖ్యనేతలను మంత్రి హరీశ్‌రావు వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ వైపు తిప్పకుంటున్నారు.
మంత్రి చొరవ ఫలితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్ సొంత పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. గురువారం నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో గాలి అనిల్‌కుమార్ బీఆర్ఎస్లో చేరారు. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకుడు, సంగారెడ్డి నియోజకవర్గ నేత రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే గురువారం నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకుడు, పటాన్చెరు నేత గడీల శ్రీకాంత్ బీజేపీకి రాజీనామా చేసి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఒకేరోజు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముగ్గురు కీలక నేతలు బీఆర్ఎస్లో చేరారు.