సంగారెడ్డి సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, టైఫాయిడ్, విషజ్వరాల పీడితులు పెరుగుతున్నారు. మూడు నెలలుగా సీజనల్ వ్యాధులు వణుకు పుట్టిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. సంగారెడ్డిలోని జనరల్ దవాఖానతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో రోగుల తాకిడి అంతకంతకూ పెరుగుతున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య లోపంతో దోమల బెడద పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. కలుషిత తాగునీటితోనూ వ్యాధులు పెరుగుతున్నాయి.
సంగారెడ్డి, సదాశివపేట, అందోల్, జహీరాబాద్ పట్టణాలతో పాటు అందోల్, కంది, రామచంద్రాపురం, పుల్కల్, కొండాపూర్, కల్హేర్, కంగ్టి, రాయికోడ్, నిజాంపేట్, రాయికోడ్, పటాన్చెరు మండలాల్లో డెంగీ, టైఫాయిడ్, జ్వరం కేసులు ఎక్కువగా ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం సంగారెడ్డి జిల్లాలో మూడు నెలల్లో 149 డెంగీ, 358 టైఫాయిడ్, 2725 విష జ్వరాల కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డిలోని జీజీహెచ్ దవాఖానలో రోజూ 1500 మంది రోగులు వస్తున్నారు. 300 మందికి పైగా ఇన్‌పేషంట్లుగా వైద్యం పొందుతున్నారు. పటాన్చెరు, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ వైద్య విధాన పరిషత్ దవాఖానలు, పీహెచ్‌సీల్లో సైతం విషజ్వరాల బారినపడిన రోగులు నమోదవుతున్నారు.
149 డెంగీ కేసులు.. అందోల్‌లోనే 28 కేసులు
జిల్లాలో ఇప్పటి వరకు 149 డెంగీ కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి కేసుల సంఖ్య పెరిగింది. అందోల్ మండలంలో అత్యధికంగా 28 డెంగీ కేసులు నమోదయ్యాయి. నేరేడ్గుంట పీహెచ్సీలో 16, తాలెల్మ పీహెచ్సీలో 12 కేసులు నమోదయ్యాయి. కందిలో 15, సంగారెడ్డిలో 21, ఆర్సీపురం 7, భానూరులో 7, కొండాపూర్‌లో 7, కరస్‌గుత్తిలో 6, నిజాంపేట్‌లో 5 ఇలా మొత్తం జిల్లా వ్యాప్తంగా 149 డెంగీ కేసులు నమోదయ్యాయి.
అటకెక్కిన పారిశుధ్యం
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య సమస్య పెరిగింది. మురుగు కాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో దోమల బెడద పెరిగింది. దోమల నివారణ కోసం ఫాగింగ్, కిరోసిన్ చల్లడం లేదు. గ్రామాల్లో పారిశుధ్యం పనులు చేపట్టేందుకు పంచాయతీల వద్ద నిధుల్లేవు. దీంతో విషజ్వరాలు పెరుగుతున్నాయి. గ్రామాల్లో తాగునీరు కలుషితం కావడంతో వ్యాధులు, జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
మూడు నెలల్లో జిల్లాలో నమోదైన కేసులు
డెంగీ – 149
మలేరియా-1
జ్వరం -2725
టైఫాయిడ్-358