సంగారెడ్డి, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పంచన చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పదవిపై వేటు తప్పకపోవచ్చు. పటాన్చెరులో ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పదవిపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తున్నది. సుప్రీంకోర్టు సోమవారం పార్టీ ఫిరాయింపు అంశంపై విచారణ సందర్భంగా నాలుగు వారాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసును తేల్చాలని అసెంబ్లీ స్పీకర్‌కు స్పష్టం చేసింది.
దీంతో స్పీకర్ కార్యాలయం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోనున్నది. దీంతో గూడెం మహిపాల్‌రెడ్డిపై వేటు పడటం ఖాయమని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. త్వరలోనే ఉప ఎన్నిక వస్తుందని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ధీమాగా చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకులు సైతం పటాన్చెరు స్థానానికి ఉప ఎన్నిక రావడం ఖాయమని అంటున్నారు. కాంగ్రెస్‌లో చేరిన గూడెం మహిపాల్‌రెడ్డిపై ఆ పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉన్నది.
కాంగ్రెస్‌లో తీవ్ర వ్యతిరేకత…
పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్‌రెడ్డి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కాటా శ్రీనివాస్‌గౌడ్‌పై 7వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మహిపాల్‌రెడ్డి ఆ పార్టీలో చేరేందుకు మొగ్గుచూపారు. గతేడాది జూలైలో జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహా, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తదితరుల సమక్షంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పారు.
కాంగ్రెస్ కండువా కప్పుకుంది మొదలు మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి నియోజకవర్గంలో ప్రభుత్వ అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాలుపంచుకున్నారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అనుచరులు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు వ్యతిరేకించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైన కాటా శ్రీనివాస్‌గౌడ్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నడంపై కాటా శ్రీనివాస్‌గౌడ్ వర్గం తీవ్ర నిరసనలకు దిగింది. కాంగ్రెస్ అధిష్టానానికి సైతం ఆయనపై ఫిర్యాదులు చేశారు.
నియోజకవర్గంలో బలంగా బీఆర్ఎస్
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పటికీ పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. గూడెం వెంట బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్‌లో చేరలేదు. ఒకరిద్దరు నేతలు మాత్రమే గూడెం వెంట కాంగ్రెస్‌లోకి వెళ్లారు. గూడెం మహిపాల్‌రెడ్డి పార్టీనీ వీడిన తర్వాత బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రతిపక్ష పాత్ర బలంగా పోషిస్తున్నది. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా వెన్నవరం ఆదర్శ్‌రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియమించారు. మాజీమంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆదర్శ్‌రెడ్డి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్నారు.
ఈ నియోజకర్గంలో బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు సింధూ ఆదర్శ్‌రెడ్డి, మెట్టుకుమార్ యాదవ్ సైతం పార్టీ బలోపేతానికి పాటుపడుతున్నారు. గుమ్మిడిదల, జిన్నారం, అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్, నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కూడిన బలమైన క్యాడర్ ఉంది. ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ను గెలిపించుకుంటామని గులాబీ దండు ధీమాగా చెబుతున్నది. బీఆర్ఎస్ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. పారిశ్రామికంగా ముందున్న పటాన్చెరు ప్రాంతానికి మరిన్ని కొత్త పరిశ్రమలు తేవడానికి కేసీఆర్, కేటీఆర్,హరీశ్‌రావు ఎంతో కృషిచేశారు. ఇవన్నీ బీఆర్ఎస్కు అనుకూలమైన అంశాలుగా చెప్పుకోవచ్చు.