పటాన్చెరు, ఏప్రిల్ 9 : తెలంగాణ ప్రజలంతా తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని అందరూ ఆశపడుతున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం పటాన్చెరు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి బీరంగూడ నుంచి మండలంలోని రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గణేశ్ మందిర్ వరకు పాదయాత్ర చేసి, గణేశ్ మందిర్‌లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు పాలేవో..నీళ్లేవో అర్థం అయిందన్నారు. మాటలు చెప్పడం తప్ప రేవంత్‌రెడ్డి అభివృద్ధి చేయడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషిచేశారని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ ప్రాంత పేదలకు జీవో 58,59 ద్వారా పట్టాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో పేదల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నదని ఆరోపించారు. పటాన్చెరు పారిశ్రామికవాడలో గతంలో వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు ఉండేవన్నారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే పవర్ హాలిడేలు ఎత్తేసి 24గంటల కరెంట్ సరఫరా చేశారని, దీంతో పరిశ్రమలు బాగా పనిచేసి ఎంతో ఉత్పాదకత సాధించాయని, అనేక రాష్ర్టాల కూలీలకు పటాన్చెరు ప్రాంతంలో ఉపాధిం లభించిందని హరీశ్‌రావు గుర్తుచేశారు.
గతంలో పటాన్చెరు ప్రాతంలో కలుషిత నీటితో జనం ఇబ్బందులు పడ్డారని, కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఈ ప్రాంతానికి శుద్ధినీటిని అందించి తాగునీటి వెతలు తీర్చారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పటాన్‌చెరుకు ఆర్డీవో కార్యాలయం, రిజిస్ట్రేషన్ కార్యాలయలు మంజూరు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ప్రారంభించడం లేదన్నారు. కేసీఆర్ పటాన్చెరు ప్రజలు, ఈ ప్రాంత కార్మికులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు 200 పడకల దవాఖాన నిర్మాణం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం దవాఖానను ప్రారంభించడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. పార్టీ కోసం పని చేస్తున్న నాయకులకు, కార్యకర్తలను పార్టీ కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు.
ఈనెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పటార్‌చెరు నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరు కావాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటించి ఇప్పటికీ ఇవ్వడం లేదన్నారు. హైడ్రా పేరుతో పేదల బతుకులు కూల్చి రోడ్డున పడేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్కు డబ్బులు వసూలు చేస్తున్నదని విమర్శించారు. అధికారంలో వచ్చాక ఫార్మాసిటీ భూములు తిరిగి రైతులకు ఇస్తామని చెప్పి 16 వేల ఎకరాల భూములు తిరిగి సేకరణ చేస్తున్నారని ఆరోపించారు.
రైతుభరోసా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. రెండు విడతలు ఎగ్గొట్టినట్లు ఆరోపించారు. రుణమాఫీ సంపూర్ణంగా చేయలేదన్నారు. రూ. 4 వేల పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. మహిళలు రూ.2500 డబ్బులు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్ధతతో ఆదాయం తగ్గిపోయిందన్నారు. హెచ్‌సీయూ భూములు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఈగలు కొట్టుకునే పరిస్థితి వచ్చిందని, రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ఆదాయం తగ్గిందన్నారు.
కేసీఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిందని, కాంగ్రెస్ పాలనలో పడిపోయిందని హరీశ్‌రావు ఆరోపించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్లు లలితా సోమిరెడ్డి, కొలన్ రోజాబాల్రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేశంగౌడ్, కొలన్ బాల్‌రెడ్డి, సోమిరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి,రాజేశ్వర్‌రెడ్డి, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, పృథ్వీరాజ్, శ్రీధర్‌చారి, యూనుస్, మీన, చంద్రశేఖర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, తొంట అంజయ్య, బీ వెంకట్‌రెడ్డి, ఎం.కృష్ణ, మానిక్‌రెడ్డి, వెంకటేశ్, రాకేశ్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే అభివృద్ధి జరుగుతుందా, నిధులు ఎక్కడి నుంచి తీసుకు వస్తారు… కరెంట్ సరిగ్గా సరఫరా చేస్తారా..పరిపాలన వీరితో సాధ్యమా అని అప్పట్లో వెకిలి మాటలు మాట్లాడారని, వాటన్నింటినీ కేసీఆర్ పటాపంచలు చేశారని శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనా చారి అన్నారు. తెలంగాణ వైపు దేశం చూసేలా అన్నిరంగాల్లో కేసీఆర్ అభివృద్ధి చేసినట్లు గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, రాష్ర్టాన్ని విధ్వంసం చేస్తున్నదని ఆరోపించారు. వరంగల్ మహాసభకు పార్టీ శ్రేణులు దండులా కదిలి వచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
-మధుసూదనాచారి, శాసన మండలి ప్రతిపక్షనాయకుడు
పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరగానే నియోజకవర్గంలో బీఆర్ఎస్ పని అయిపోందని కొందరు ప్రచారం చేశారన్నారు. పటాన్చెరులో బీఆర్ఎస్ బలంగా ఉందని, రానున్న అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇక్కడ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
అందరినీ కలుపుకొని పోయి నియోజకవర్గంలో బీఆర్ఎస్ను ప్రబలశక్తి మారుస్తామని ఆదర్శ్‌రెడ్డి అన్నారు. వరంగల్‌లో నిర్వహించే సభకు భారీగా నాయకులు, కార్యకర్తలు తరలించేందుకు కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పటాన్చెరు కార్పొరేటర్ కుమార్‌యాదవ్, తెల్లపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ లలితా సోమిరెడ్డి, బొల్లారం మున్సిపల్ మాజీ చైర్మన్ రోజా బాల్‌రెడ్డి, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, వెంకటేశం, జైపాల్‌రెడ్డి, వివిధ మండలాలకు చెందిన నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
– పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి