సిద్దిపేట, మే 22( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామపం చాయతీలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామంలోని చిన్న చిన్న సమస్యలను తీర్చాలాంటే జీపీల్లో రూపాయి బిల్ల లేదు. ఐదు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయడం లేదు. ఫిబ్రవరి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. అప్పటి నుంచి గ్రామాలకు నిధులు రాకపోవడవడంతో పంచాయతీ కార్యదర్శులపై ఆర్థ్ధిక భారం పడుతున్నది. పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి గ్రామాల్లో ఉన్న చిన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. తాము ఇక ఈ భారం మోయలేమని ఎంపీడీవోలకు వినతి పత్రాలు అందజేస్తున్నారు. ఇటీవల మెదక్ జిల్లా నర్సాపూర్ మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు స్థానిక ఎంపీడీవోకు తమ సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. ఇక తాము సొంత డబ్బులు పెట్టి గ్రామాల్లో సమస్యలను పరిష్కరించలేమని పేర్కొన్నారు. మరోవైపు పారిశుధ్య కార్మికులు జీతాలు రాకపోవడంతో పనిలోకి రామని ఖరాఖండీగా చెబుతున్నారు. జూన్ నుంచి తాము పనిచేయబోమని చెబుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 647, మెదక్ జిల్లాలో 469, సిద్దిపేట జిల్లాలో 499, ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 1,615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి జీపీకి పంచాయతీ కార్యదర్శిని నియమించింది. కార్యదర్శులపై ఆర్థిక భారం పడకుండా నెలనెలా పల్లెప్రగతి ద్వారా ప్రత్యేక నిధులు విడుదల చేసింది.దీంతో గ్రామాలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాయి. గ్రామానికి వచ్చే ప్రత్యేక నిధులతో పాటు ఇతర అభివృద్ధి నిధులతో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టేవారు. మొక్కల పెంపకం, పారిశుధ్య నిర్వహణ, ఇంటింటా చెత్త సేకరణ పక్కాగా చేపట్టేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటుతున్నా గ్రామాలకు రూపాయి నిధులు విడుదల చేయలేదు. దీంతో పంచాయతీల్లో పాలన పడకేసింది.పంచాయతీ పారిశుధ్య సిబ్బందికి వేతనాలు రావడం లేదు. జనవరి 31తో సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. గ్రామాలకు ప్రత్యేకాధికారులు చుట్టపు చూపులా వచ్చివెళ్తున్నారు. సమస్యల పరిష్కారానికి వారు చొరవ చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
పంచాయతీ కార్యదర్శులపై ఆర్థిక భారం పడుతున్నది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఐదు నెలలుగా ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామ స్థాయిలో ఏ చిన్న మీటింగ్ జరిగినా పంచాయతీ కార్యదర్శులే జేబు నుంచి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలోని చిన్న చిన్న అవసరాలు తీర్చాలంటే వారే సొంతంగా డబ్బులు సమకూర్చాలిస పరిస్థితి ఉంది. గ్రామాల్లో ప్రధానంగా ఇంటింటా చెత్త సేకరణకు ట్రాక్టర్‌ను గ్రామంలోకి పంపాలంటే దానికి డీజిల్ పోయించాల్సి ఉంటుంది. ఒక్క చిన్న గ్రామ పంచాయతీకి లెక్కకట్టినా నెలకు ఎంత లేదన్నా డీజిల్‌కు రూ. 20వేల పైనే ఖర్చు అవుతున్నది. చెత్త సేకరణకు ట్రాక్టర్‌ను పంపకపోతే గ్రామం అంతా కంపు కొడుతుంది. గ్రామంలో పారిశుధ్య పనుల నిర్వహణ, బోర్ల రిపేరు, తాగునీటి పైప్‌ల రిపేరు, పైప్‌లైన్ లీకేజీ, వీధిదీపాల నిర్వహణ, తాగునీటి ఎద్దడి ఏర్పడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, ఇలా ఎన్నో పనులు గ్రామాల్లో చూసుకోవాల్సి వస్తున్నదని పంచాయతీ కార్యదర్శులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఐదు నెలలుగా పంచాయతీ కార్యదర్శులు కొందరు తమ వేతనాల నుంచి, మరికొందరు వ్యాపారుల వద్ద వడ్డీలకు అప్పలు తెచ్చి గ్రామ సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఒకవేళ డబ్బులు లేవు అని …సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వం నుంచి, ఉన్నత స్థాయి అధికారుల నుంచి వేధింపులకు గురికావాల్సి వస్తున్నదని, తమను ఎక్కడ సస్పెన్షన్ చేస్తారేమోనని పంచాయతీ కార్యదర్శులు భయపడుతున్నారు. దీంతో సొంతంగా డబ్బులు ఖర్చుచేసి గ్రామాల్లో అవసరాలను తీర్చుతున్నారు. ఒక్కో చిన్న గ్రామ పంచాయతీ కార్మదర్శి ఇప్పటికే రూ 60 నుంచి 80 వేలు సొంతగా ఖర్చు చేశాడు. మేజర్ గ్రామ పంచాయతీల్లో రూ.లక్షల్లోనే ఖర్చు పెట్టినట్లు తెలుస్తున్నది. తమకు వచ్చిన జీతం గ్రామాలకు పెట్టుకుంటా పోతే తమ కుటుంబాలు పోషణ ఎలా గడిచేది ..? అని పంచాయతీ కార్యదర్శు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించాలని వారు కోరుతున్నారు.