‘ఈ కథ వినగానే నచ్చేసింది. ఇది అందరికీ రిలేటయ్యే కథ. ముఖ్యంగా నాది మంచి పాత్ర. నా కేరక్టరైజేషన్ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో హీరోయిన్ డామినేషన్ నా పాత్రకు సమస్యగా మారుతుంటుంది. అందులోంచి అద్భుతమైన ఫన్ జనరేటవుతూవుంటుంది. ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకునే సినిమా ఇది’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విష్ణు విన్యాసం’. నయన్సారిక కథానాయిక. యదునాథ్ మారుతీరావు దర్శకుడు. సుమంత్‌నాయుడు.జి నిర్మాత. శుక్రవారం(నేడు) సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో శ్రీవిష్ణు విలేకరులతో ముచ్చటించారు. ‘ఇలాంటి పాత్ర చేయడం నాకిదే ప్రథమం. ఈ పాత్రకు కొన్ని రూల్సుంటాయి. నమ్మకాల్ని ఫాలో అయ్యే పాత్ర. పైగా లెక్చరర్. చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. ఫస్టాఫ్ యూత్‌కీ, సెకండాఫ్ ఫ్యామిలీస్‌కీ కనెక్టవుతుంది. మారుతీరావు క్లారిటీ ఉన్న దర్శకుడు. తనకు ఎడిటింగ్‌పై గ్రిప్పుంది. అందుకే ఎక్కడా ల్యాగ్ లేకుండా అద్భుతంగా సినిమాను మలిచాడు. అనుభవం ఉన్న టెక్నీషియన్స్ పనిచేయడం కూడా సినిమాకు కలిసొచ్చింది’ అని తెలిపారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా 80శాతం పూర్తయిందని, అలాగే రామ్ అబ్బరాజుతో ఓ సినిమా, సితార సంస్థలో సన్నీ అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నానని శ్రీవిష్ణు చెప్పారు.