శివ్వంపేట, జనవరి 3 : కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరిస్తే ప్రజల తరఫున ఉద్యమిస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నవాబ్‌పేట గ్రామంలో సర్పంచ్ అశోక్‌రెడ్డి, ఎంపీడీవో భారతితో కలిసి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రైతులకు పంటపెట్టుబడి సాయం కింద డిసెంబర్ 9వ తేదీ నుంచి రైతుభరోసా అందజేస్తామని చెప్పిందని, జనవరి 9వ తేదీ వస్తున్నా ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సాయం అందించకపోవడం బాధాకరమన్నారు. క్వింటాలు వరికి రూ.500 బోనస్, రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. ఈ నెల 6 వరకు ప్రజాపాలన కొనసాగుతుందని, ప్రజలు ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కొత్త రేషన్ కార్డు మంజూరుకు దరఖాస్తు పెట్టుకోవాలన్నారు. మండలంలోని నవాబ్పేటతోపాటు దొంతి, లచ్చిరెడ్డిగూ డెం, గుండ్లపల్లి గ్రామాల్లో ప్రజాపాలన నిర్వహించారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ మన్సూర్, సర్పంచులు ఏనుగు అశోక్‌రెడ్డి, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, పెంజర్ల శ్రీనివాస్ యాదవ్, తహసీల్దార్ శ్రీనివాస్‌చారి, నల్ల రవిగౌడ్, మహిపాల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు.
నర్సాపూర్, జనవరి 3 : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నాగులపల్లిలో ‘ప్రజాపాలన’ ప్రారంభించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో మహిళలకు ప్రతినెలా రూ.2500, వంటగ్యాస్ సిలిండర్‌ను రూ.500 అందించాలన్నారు. రైతుభరోసా పథకంలో ఎకరానికి ఏటా రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి, సర్పంచ్ సేనాధిపతి, ఎంపీటీసీ మేఘమాలకిషన్, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నాయకుడు సత్యంగౌడ్ పాల్గొన్నారు.