నంగునూరు, జూలై 8: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె దవాఖానల పేరుతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించింది. ఇందులో భాగంగానే సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలలో రూ.2 కోట్లతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక కృషితో ఆరు పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. మారుమూల ప్రాంతాల్లో సైతం నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి హోదాలో హరీశ్‌రావు దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
పనులు పూర్తయి చాలా రోజులు గడిచినప్పటికీ దవాఖాన ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఈ దవాఖాన మండలంలోని అక్కెనపల్లి, ఖాతా, గట్లమల్యాల, ఘనపూర్, కొండంరాజ్పల్లి గ్రామాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది. వైద్యం కోసం నంగునూరు, సిద్దిపేటకు వెళ్తున్నారని, ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న హరీశ్‌రావు నంగునూరు ప్రభుత్వ దవాఖానను సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)గా అప్‌గ్రేడ్ చేయించడంతో పాటు గట్లమల్యాలలో పీహెచ్సీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పీహెచ్సీ మంజూరు చేయడంతో పాటు అప్పటికప్పుడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం పనులను సైతం గట్లమల్యాలలో ప్రారంభించారు. దవాఖాన పనులు పూర్తయినప్పటికీ దాన్ని పట్టించుకునే నాథుడు లేక అరకొర వసతులతోనే (సబ్ సెంటర్లోనే) పీహెచ్సీ స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
స్థానిక నాయకత్వం, అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో అన్ని హంగులతో నిర్మించిన గట్లమల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పనులు పూర్తయినప్పటికీ ప్రారంభించడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దవాఖానను ప్రారంభిస్తే మండలంలోని ఆరు గ్రామాలకు, హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని నాగసముద్రాల, ధర్మారం, బత్తులోనిపల్లితో పాటు పలు గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందనున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి దవాఖానను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.
వాగు అవతలి గ్రామాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేశారు. రూ.2 కోట్లతో అన్ని హంగులతో నిర్మించినప్పటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పం దించి పీహెచ్‌సీని ప్రారంభిస్తే వాగు అవతలి గ్రామాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్థానిక ప్రజల కోరిక మేరకు త్వరగా ప్రారంభించాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నా.
– ఎడ్ల సోమిరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్, నంగునూరు మండలం
మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రత్యే క కృషితో దవాఖానకు నిధులు ఇచ్చి పనులు పూర్తి చేసి నా ఇంకా ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఆరోగ్య ఉప కేంద్రంలో తాత్కాలిక వైద్య సేవలు అందుతుండటంతో రోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దవాఖాన నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభం చేయకపోవడంతో ఆప్రాంతం మందుబాబులకు అడ్డాగా మారింది. అధికారులు స్పందించి దవాఖానను ప్రారంభించాలి.
– జాప శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీపీ