చేర్యాల, ఫిబ్రవరి 9 : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుడు ప్రచారాలు నమ్మి ప్రజలు మోసపోయారని, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరోసారి మోసపోవద్దని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి యేల్లు రవీందర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ అభ్యర్థులతో కలిసి ఆయన జాతీయ రహదారి పై భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అమ్మాయిల పెండ్లికి ఇస్తానన్న తులం బంగారం ఇవ్వలేదని, పింఛన్లు పెంచలేదని, చదువుకుంటున్న యువతులకు స్కూటీలు ఇస్తానని ఇవ్వలేదని, రైతుబందు బంద్ చేసిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయవద్దని కోరారు.చేర్యాల అభివృద్ధిని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా నిధులు తీసుకువచ్చి చేర్యాల, జనగామ పట్టణాలు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.చేర్యాల అంగడి బజారుకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఇటీవల మంజూరు చేయించిన రూ.15కోట్లతో మున్సిపల్ కార్యాలయం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థ్ధాపన చేయించినట్లు తెలిపారు.
పెద్ద చెరువు కట్ట అభివృద్ధికి రూ.3కోట్ల14లక్షలను అమృత్పథకంలో మంజూరు చేయించినట్లు తెలిపారు. చేర్యాలలోని 12 వార్డుల్లో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కేవలం కేసీఆర్ పాలనలో మంజూరు చేసిన నిధులతో జరిగిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు అవుశర్ల నాగమణికిష్టయ్య, కమలాపురం గీతాంజలి,నిమ్మ సుప్రజరాజీవ్రెడ్డి, తొడెంగుల రాజేశ్, ముస్త్యాల అరుణబాల్నర్సయ్య, మెరుగు లక్ష్మణ్‌గౌడ్, బూనాద్రి సురేశ్, వీరబత్తిని సదానందం, మేడిశెట్టి ఉమాశ్రీధర్, ఎజాస్(బబ్లూ), శివగారి భవితాఅంజయ్యతో పాటు సీపీఎం అభ్యర్థి భూమిగారి లావణ్యాప్రభాకర్ పాల్గొన్నారు.