చేర్యాల, జూన్ 29: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త, బూత్ లెవల్ ఏజెంట్ బాధ్యతాయుతంగా పని చేయాలని, ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలపునిచ్చారు. జనగామలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేర్యాల, మద్దూరు,ధూళిమిట్ట, కొమురవెల్లి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ పై బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎన్యూమరేషన్ ఫామ్‌లు సక్రమంగా నింపడంలో ప్రజలకు సహకరించాలన్నారు.
బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటికి రెండు ఎన్యూమరేషన్ ఫామ్‌లు అందజేస్తారని, వాటిలో ఒకదాన్ని పూర్తి చేసి బీఎల్వోకు ఇవ్వాలని, మరో కాపీని రసీదుగా భద్రపర్చుకోవాలన్నారు. ఫామ్‌లో ఓటరు పేరు వారి కుటుంబ సభ్యుల వివరాలు, ఈపీఐసీ నంబర్ తదితర వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయించాలన్నారు. కుటుంబంలోని ఓటర్ల వివరాలను ఒకేచోట నమోదు చేసి ఫ్యామిలీ మ్యాపింగ్ ప్రక్రియ అత్యంత కీలకమని, 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా పరిగణిస్తారని వివరించారు.ఆధార్‌లో ఉన్న వివరాలకు అనుగుణంగా ఫామ్ నింపాలని, డిక్లరేషన్‌పై సంతకం చేయాలని, 18 ఏండ్లు పూర్తి చేసుకున్న కొత్త ఓటర్ల కోసం బీఎల్వోలు అందించే ఫామ్-6ను తప్పకుండా నింపి సమర్పించాలన్నారు.
జూలై 24 వరకు ఇంటింటా వెరిఫికేషన్, ఫామ్‌ల సేకరణ జరుగుతుందని, జూలై 31న డ్రాప్ట్ ఓటర్ల జాబితా విడుదలవుతుందని, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్స్ స్వీకరణ ఉంటుందని, అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారని తెలిపారు. ఓటర్లు ఆఫ్‌లైన్‌తో పాటు ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ల ద్వారా సర్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వచ్చిన సర్ విధానం ద్వారా ఓటును సరి చేస్తున్నారని, ఓట్ల తొలిగింపు, చేర్పులు, మార్పులు, చనిపోయిన వారి వివరాలు, డబుల్ ఓట్లు చెక్ చేస్తున్నట్లు తెలిపారు.గ్రామంలో ఓటు లేకపోతే మనిషి బతికున్నా చనిపోయిన వారితో సమానంగా చూస్తారని, అర్హులకు ఓటు హక్కు ఉండేవిధంగా చూసుకోవాలన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులు చేస్తున్న తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.