కొమురవెల్లి, నవంబర్ 21: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కొమురవెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ.. తాను గెలిచిన ఈ రెండేండ్లలో మీ కష్టసుఖాల్లో తోడున్నానని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ పార్టీలకతీతంగా తన నీలిమా దవాఖానలో ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పండుగలప్పుడు చీరలిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు చీరలు అందిస్తున్నదని ఎద్దేవా చేశాడు.
బీఆర్ఎస్ హయాంలోనే కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాభివృద్ధికి రూపాయి నిధులు కేటాయించలేదన్నారు. ఆలయ సమస్యలను మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. జాతర అయిపోయేలోపు అమ్మవార్లకు బంగారు కీరిటాలు చేయించడంతో పాటు రాజీవ్ రహదారి వద్ద ప్రయాణికుల రోడ్డుకు రెండు వైపులా బస్టాండ్ ఏర్పాటు చేయాలని, కొమురవెల్లి నుంచి కొండపోచమ్మ వరకు వీధిలైట్లు ఏర్పాటు చేయడం, గుట్టపై ఢమరుకం, ఘనశులం ఏర్పాటు చేయించాలని తాను సూచించినట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువన్నపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం అనంతరం పోసాన్‌పల్లికి వెళ్తూ గ్రామ శివారులోని ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే పల్లా సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను ఎమ్మెల్యే పల్లా ఫోన్లో కలెక్టర్ హైమావతి దృష్టికి తీసుకెళ్లారు. తపాస్పల్లిలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి దగ్గరికి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు వచ్చి మాట్లాడారు. గ్రామానికి సిద్దిపేట డిపో బస్సు విద్యార్థుల సమయానికి రావడం లేదని, గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ లీకేజీతో కలుషిత నీరు వస్తున్నదని, గతంలో ఉన్న వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని ఎమ్మెల్యే పల్లా దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే వెంటనే సిద్దపేట డిపో మేనేజర్‌కు ఫోన్ చేసి విద్యార్థుల సమయానికి అనుగుణంగా బస్సు నడిపాలని కోరారు. తాను పైసలు ఇస్తానని, వాటర్ ప్లాంట్‌ను రిపేర్ చేయించాలని బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు సాయిబాబాకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
కొమురవెల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో కొమురవెల్లి మండలానికి చెందిన పలువురు యువకులు బీజేపీ, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గీస భిక్షపతి, మాజీ జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, మాజీ ఎంపీపీ తలారి కీర్తనాకిషన్, మాజీ వైస్ ఎంపీపీ కాయిత రాజేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొంగు రాజేందర్‌రెడ్డి, సార్ల కిష్టయ్య, పబ్బొజు విజేందర్, ముత్యం నర్సింహులుగౌడ్, ఏర్పుల మహేశ్, గొల్లపల్లి కిష్టయ్య, బుడిగె గురువయ్యగౌడ్, పచ్చిమడ్ల స్వామిగౌడ్, కొండ శ్రీధర్, మెరుగు కృష్ణగౌడ్, బూర్గు నారాయణ, పుట్ట కనకరాజు, ఆయా గ్రామాల బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.