అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
చేర్యాల, డిసెంబర్ 17: చరిత్ర కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని మంగళవారం అసెంబ్లీలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గళమెత్తారు. కోట్లాది తెలంగాణ ప్రజల ఇలవేల్పు కొమురవెల్లి మల్లన్న క్షేత్రం, నకాషీ పెయింట్స్ కలిగిన అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం అన్నారు. మొదటి అసెంబ్లీ సమావేశంలో తనకు కొత్త సభ్యుడిగా అవకాశం వచ్చినప్పుడు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ మంత్రికి లెటర్ అందజేశామన్నారు. చేర్యాల టౌన్, చేర్యాల, కొమురవెల్లి, దూళిమిట్ట, మద్దూరు మండలాలు ఉన్నాయి. చేర్యాల ఎప్పటినుంచో నియోజకవర్గం, పాత తాలూకా కేంద్రంగా ఉంది.
ఐదు మండలాలకు సంబంధించిన ప్రజలు ఒక్కొక్కరు ఒక్కో దగ్గరికి పోవాల్సి వస్తున్నది. పోలీస్ పనుల కోసం హుస్నాబాద్‌కు, రెవెన్యూ పనుల కోసం సిద్దిపేట, హుస్నాబాద్‌కు, వ్యవసాయ పనుల కోసం గజ్వేల్ పోవాల్సి వస్తున్నది. నియోజకవర్గ పనులుంటే జనగామకు రావాల్సి వస్తున్నది. ప్రజలు వివిధ రకాల పనుల కోసం వివిధ ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తూ అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. చేర్యాలలో జేఏసీ ఉద్యమం జరిగితే నాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వచ్చి మేము అధికారంలోకి రాగానే కచ్చితంగా చేర్యాల డివిజన్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి కొండా సురేఖ సైతం సమీక్షా సమావేశంలో, కొమురవెల్లికి వచ్చినప్పుడు ప్రజల కోరిక తప్పక పరిష్కరిస్తామని మాట ఇచ్చారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావడానికి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణంలో ఉంది. కొంతమంది స్టాఫ్ ఇచ్చినట్లయితే బాగుంటుంది. గత నెలలోనే కోర్టుకు సంబంధించిన పర్మిషన్ వచ్చింది. రెవెన్యూ శాఖామాత్యులు నేను ఇచ్చిన లెటర్‌ను సిద్దిపేట కలెక్టర్‌కు పాజిబిలిటీ కోసం పంపించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో చిన్న ప్రాంతం అయిన ఏటూరునాగారాన్ని డివిజన్‌గా చేశారు. చేర్యాలను డివిజన్ చేసి ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలన్నారు.