చేర్యాల, నవంబర్ 22: సిద్దిపేట జిల్లా చేర్యాలలోని కొత్త దవాఖానలో సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించడంతో పాటు పరికరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. చేర్యాలలోని బీడీ కాలనీ వద్ద రూ.8.70 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ దవాఖాన భవవాన్ని శనివారం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ హైమావతితో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల ప్రజలకు వైద్యం అందించేందుకు చేర్యాలలో నూతనంగా నిర్మించిన భవనం ప్రారంభంతో ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. ఈ దవాఖానలో కనీసం రోగులకు ఐదుగురు కిడ్నీ రోగులకు డయాలిసిస్ సేవలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీహెచ్‌వో అన్నపూర్ణ, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు చెందిన మహిళలకు ఇందిరమ్మ చీరలను ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ హైమావతితో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పంపిణీ చేశారు. 119 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు.తెలంగాణ జాతీయ గీతాన్ని రచించిన మద్దూరు మండలంలోని రేబర్తికి చెందిన ప్రజాకవి అందెశ్రీని స్మరిస్తూ చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలు, అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మౌనం పాటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేవలం మహిళా సంఘాల సభ్యులే కాకుండా 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు చీరె అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీవో జయదేవ్, ఆర్డీవో సదానందం, పీఏసీఎస్ చైర్మన్లు మెరుగు కృష్ణ, నాగిళ్ల తిరుపతిరెడ్డి, నాలుగు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.