మెదక్ : మెదక్ జిల్లా రాంపూర్ జాతీయ రహదారిపై నిన్న (శనివారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో హవేలీఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన తండ్రి, కుమారుడు అమృత్ గౌడ్, రిషి వర్ధన్ గౌడ్, అలాగే వారి అల్లుడు సాయ్ గౌడ్ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మా దేవేందర్ రెడ్డి ఆదివారం బూరుగుపల్లి గ్రామానికి చేరుకుని అమృత్ గౌడ్, రిషి వర్ధన్ గౌడ్ పార్థివ దేహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒకే ప్రమాదంలో తండ్రి, కుమారుడు, అల్లుడు ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరివెంట బూరుగుపల్లి మాజీ సర్పంచ్ చెన్న గౌడ్, హవెలిఘనపూర్ సర్పంచ్ సాయిలు, నాయకులు బాలరాజ్, రవీందర్ గౌడ్,సాప.సాయిలు, రాంచంద్రం రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.