మెదక్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): మీ ఆశీస్సులతో మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచానని మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ధి ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లాకేంద్రంలోని సీఎస్ఐ చర్చి కాంపౌండ్‌లో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ధి పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ… 2014లో కేసీఆర్ తనకు టిక్కెట్ ఇచ్చి మెదక్‌కు పంపించారని, ఆయన ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మెదక్‌ను జిల్లా కేంద్రం చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని, జిల్లా కేంద్రమైన తర్వాత సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటు రైల్వేలైన్‌ను ఇచ్చారని గుర్తుచేశారు. గత ప్రభుత్వాల హయాంలో పాలకుల నిర్లక్ష్యంతో ఘనపూర్ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత సింగూరు నీటిని మెదక్‌కు అంకితం చేశారని తెలిపారు. ఘనపూర్ ఆనకట్ట కింద మహబూబ్‌నహర్, ఫత్తేనహర్ కాలువలను ఆధునీకరించి చివరి గుంట వరకూ నీటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ చెల్లిందని పేర్కొన్నారు. ఘనపూర్ ఆనకట్ట అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు కేటాయించారని గుర్తుచేశారు. మంజీర, హల్దీవాగులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించి కింద ఉన్న పంట పొలాలను సస్యశ్యామలం చేశారన్నారు. రైతుల సంక్షేమం ఒక్క కేసీఆర్‌కే సాధ్యమని అన్నారు. చిన్నశంకరంపేట, నిజాంపేట మండలాలకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉందని, అది కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. మెదక్ నియోజకవర్గం మొత్తం సస్యశ్యామలం అవుతుందని పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్న 18 ప్రభుత్వ కార్యాలయాలు సిద్దిపేటకు తరలిపోయాయని ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, పద్మక్క ఉండగా, కేసీఆర్ ఉండగా ఇలాంటి జరగవని, ప్రభుత్వ కార్యాలయాలు మెదక్‌లోనే ఉన్నాయని పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మెదక్ అన్నిరంగాల్లో వెనుకబడి పోయిందని, ఇప్పుడు కావాలనే ప్రతిపక్ష నాయకులు అబద్ధాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశారని, రామాయంపేటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేశారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నానని ఆమె తెలిపారు. మెదక్ నియోజకవర్గ ప్రజలు ఆడబిడ్డలా ఆదరిస్తున్నారని, మీసేవ కోసం పనిచేస్తానని, పునరంకితమవుతానని పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు.
మెదక్ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, గతంలో సీఎం కేసీఆర్ మెదక్‌కు వచ్చినప్పుడు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత మెదక్ పట్టణ రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. మెదక్‌కు రింగ్ రోడ్డును మంజూరు చేయాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్య అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి సభలో సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.