Padma Devender Reddy : అభివృద్ధి పేరు చెప్పి మెదక్ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి(Padma Devender Reddy) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని. మహిళలకు బాకీ పడ్డ పెన్షన్ రూపాయలను వెంటనే చెల్లించాలని ఆమె కాంగ్రెస్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో మరోసారి మెదక్ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను నమ్మవద్దని గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో 10 వార్డు సభ్యులను మాజీ ఎమ్మెల్యే కోరారు.
పదో వార్డు నుండి పోటీ చేస్తున్న వనం శ్రీలత వెంకటేష్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న పద్మా దేవెందర్ రెడ్డి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని తప్పకుండా గెలిపించే బాధ్యత మీ అందరిపై ఉందని అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వనం శ్రీలత తరఫున సహాయం అందించడానికి మీ సేవలో ఉంటామని ఆమె స్పష్టం చేశారు.
మెదక్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఈ వార్డుకు చెందిన చాలామంది లబ్ధిదారులకు అందించామని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. అభివృద్ధి పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ మరో మారు మెదక్ ప్రజలను మోసం చేస్తోందని, అందరం జాగ్రత్తగా ఉండి వనం శ్రీలతను తప్పకుండా గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోపాలకృష్ణ, చింతల శ్రీనివాస్, ఏడుపాయల మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మహిళా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.