పాపన్నపేట, మార్చి 30: సింగూరు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి కోరారు. సోమవారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని చిత్రియాల్లోని మంజీరా తీర ప్రాంతంలోని పంటలను రైతులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల నేపథ్యంలో రైతులు పంటలు వేసిన తర్వాత క్రాప్‌హాలిడే ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పటికే రైతులు పంటలు సాగుచేశారని, ఘనపురం ఆనకట్ట కింద, ఎగువన పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల అసెంబ్లీలో సింగూరు నీరు విడుదల చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి విజ్ఞప్తి చేసినా ఇంతవరకు విడుదల చేయలేదన్నారు. అటు పంట నష్టపరిహారం చెల్లించక, ఇటు నీళ్లు విడుదల చేయక వేలాది రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. రైతుల ఉసురు తగలకుండా ఉండాలంటే వెంటనే కనీసం 0.3 టీఎంసీల నీటిని ఘనపురం ఆనకట్టకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సీజన్‌కు రైతులు అడగకముందే నీరు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
వెంటనే నీరు విడుదల చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతకుముందు ఆమె చిత్రియాల్‌లో ఇటీవల మృతిచెందిన రాజయ్య, పాపన్నపేటలో పోతేదార్ కంసమ్మ కుటుంబాలను పరామర్శించారు. ఆమె వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, రైతు బంధు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు సోములు, ఏడుపాయల మాజీ చైర్మన్ బాలాగౌడ్, చిత్రియాల్ సర్పంచ్ సురేశ్, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు కుమ్మరి జగన్, శ్రీనాథ్, బద్రి, మల్లేశం, రైతులు ఉన్నారు.