రామాయంపేట, జూలై 4: మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పైసా నిధులు కేటాయించలేదని, బీఆర్ఎస్ హయాంలో మంజూరైన నిధులకు కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపనలు చేయడం, శిలాఫలకాలు ఆవిష్కరించడం సిగ్గుచేటని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం రామాయంపేటలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. రామాయంపేట పట్టణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ హయాంలో టీయూఎఫ్ఐడీసీ నిధుల నుంచి రూ.35 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ నిధులతో టెండర్లు సైతం పూర్తిచేసినట్లు తెలిపారు.
కానీ, తామే ఆ నిధులు మంజూరు చేశామంటూ కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకోవడం తగదన్నారు. చేతనైతే నిధులు తెచ్చి అభివృద్ధి చేసి చూపించాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. అప్పటి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన ఎస్డీఎఫ్ నిధులు రూ.25 కోట్లను రేవంత్ సర్కారు రద్దుచేసిందని, కాంగ్రెస్ నాయకులకు చేతనైతే ఆ నిధులు తేవాలని పద్మాదేవేందర్‌రెడ్డి సవాలు విసిరారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు, ఏర్పాటు చేసి పాలన చేరుత చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. తాము నిధులు తెస్తే, కాంగ్రెస్ నాయకులు తెచ్చామని పోజులు కొట్టడం తగదన్నారు. 19 నెలల కాంగ్రెస్ పాలనలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రూపాయి నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని పద్మాదేవేందర్‌రెడ్డి విమర్శించారు.
మెదక్ నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. మెదక్‌లో 100 సీట్ల మెడికల్ కళాశాలను కేసీఆర్ మంజూరు చేస్తే, దానిని 50సీట్లను కుదించి, 50 సీట్లను సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు తన్నుకు పోయారని ఆరోపించారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా చేశామని, డిగ్రీ కళాశాలను రామాయంపేటకు మంజూరు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. డిగ్రీ కళాశాలలో నేడు వందల మంది విద్యార్థులు చదువుతుండడం సంతోషంగా ఉందన్నారు. డివిజన్‌కు జీవోలు తెచ్చి ప్రారంభిస్తే, ఇప్పుడున్న సర్కార్ కనీసం కార్యాలయంలో సిబ్బందిని నియమించలేదని విమర్శించారు. నిరుపేదల కోసం మెదక్, రామాయంపేటలో డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించి ఇచ్చినట్లు గుర్తుచేశారు.
బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడితే సహించమని, 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమావేశంలో రామాయంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, మాజీ పురపాలిక వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుట్టి యాదగిరి, చంద్రపు కొండల్‌రెడ్డి, ఎస్కే హైమద్, ఉమామహేశ్వర్, సుభాష్ రాథోడ్, కాట్రియాల శాములు, రాజేందర్ గుప్తా, మైలారం భిక్షపతి, డాకి శ్రీనివాస్, శ్రీకాంత్సాగర్, పాతూరి సాయి, ఐలయ్య, భూమ మల్లేశం, పరుపాటి సుధాకర్‌రెడ్డి, కన్నపురం కృష్ణాగౌడ్, అస్నొద్దీన్, నాగార్జున, ఒద్ది స్వామి, భానుచందర్, చింతల రాములు తదితరులు పాల్గొన్నారు.