మెదక్, జూన్ 15(నమస్తే తెలంగాణ): గతేడాది భారీ వర్షాలకు దెబ్బతిన్న రాయన్‌పల్లి ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించడంపై మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి మండిపడ్డారు. మెదక్ జిల్లాలోని రాయన్‌పల్లి ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని సోమవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలసి ఆమె భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులపై నిర్లక్ష్యం వహిస్తున్నదని, దీంతో సాగునీరు అందుకు రైతులు పంటలు సాగుచేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గతేడాది మెదక్‌లో భారీ వర్షాలు కురవడంతో రాయన్‌పల్లి ప్రాజెక్టు తూము, అలుగులు, సాగునీటి కాల్వలు దెబ్బతిన్నాయని తెలిపారు. గతేడాది తాత్కాలిక మరమ్మతులు చేసుకుని పంటలు పండించుకున్నట్లు గుర్తుచేశారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనా ప్రభుత్వం ఇంతవరకు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం లేదన్నారు. మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా నిధులు మంజూరు చేయడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి, రైతులకు సాగునీరంచేందుకు చర్యలు తీసుకోవాలని పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ రాయన్‌పల్లి ప్రాజెక్టును పరిశీలించి, మరమ్మతులకు నిధులు మంజూరు చేయించాలని కోరారు.
రాయన్‌పల్లి ప్రాజెక్టు కింద 2500 ఎకరాలకు ఆయకట్టు ఉందన్నారు. మరమ్మతులు చేయకపోతే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల్లోగా మరమ్మతులు పూర్తి చేయకపోతే వాననీరు వృథాగా బయటకు పోయే ప్రమాదం ఉందన్నారు. వానకాలం రాకముందే మరమ్మతులు చేయాలని అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా, ఇంతవరకు నిధులు మంజూరు చేయలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని ప్రాజెక్టుకు మరమ్మతులకు నిధులు మంజూరు చేయించాలని పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
మెదక్ కలెక్టరేట్ గేట్ ఎదుట సోమవారం మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు, రైతులు భారీగా తరలివచ్చారు. మెదక్ మండలంలోని తిమ్మానగర్, మక్తభూపతిపూర్, గుట్టకిందిపల్లి, శివాయపల్లి, మల్కాపూర్ తండా, వెంకటపూర్, కొంటూర్కు చెందిన రైతులు భారీగా తరలివచ్చారు. రైతులు, బీఆర్ఎస్ నాయకులు కలెక్టరేట్ వద్దకు చేరుకుని, కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా, కలెక్టరేట్‌లోనికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
దీంతో కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. చివరకు జిల్లా అధికారుల అనుమతితో ప్రజావాణిలో కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ప్రాజెక్టును పరిశీలించి మరమ్మతులు చేయించాలని కలెక్టర్‌ను కోరారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు బట్టి జగపతి, మల్లికార్జున్‌గౌడ్, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ మామిం డ్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు అంజాగౌడ్, మా జీ ఎంపీపీ కిష్టయ్య, బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, మాయ మల్లే శం, ఆర్కే శ్రీనివాస్, కిశోర్, ఇందాద్, మేకల సాయిల్, సాప సాయిల్, చెన్నాగౌడ్, సాయాగౌడ్, రాజేశ్వర్‌రా వు, నరేందర్‌రెడ్డి, శ్రీనునాయక్, గురుమూర్తి గౌడ్ పాల్గొన్నారు.