కొల్చారం, జూలై 29: ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో కరువు వచ్చే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు ముందు నుంచే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. నాలుగు రోజులుగా మంజీరా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని ఘనపూర్ ఆయకట్టు పొంగి పొర్లుతున్న సందర్భంగా బుధవారం ఆమె బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి ఘనపూర్ ఆయకట్టు వద్ద గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో వానదేవుడు కరుణించి వర్షాలు పడటం సంతోషంగా ఉందన్నారు. 60 నుంచి 70 శాతం నాట్లు పూర్తయిన తర్వా త ప్రభుత్వం రైతుమేళాలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా’ ఆలస్యంగా విత్తన మేళాలు ప్రారంభిస్తే ప్రయేజనం ఏమిటని ప్రశ్నించారు. మరోవైపు నియోజకవర్గంలో యూరియా కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయన్నారు. ఇతర నియోజక వర్గాలకంటే నర్సాపూర్ నియోజకవర్గంలో ఇప్పటికీ యూరియా కొరత ఉందన్నా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరీశంకర్, యువత విభాగం అధ్యక్షుడు సంతోష్‌రావు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రవితేజరెడ్డి, సర్పంచ్‌లు స్వామి, ఆంజనేయులు, ఉప సర్పంచ్ రవీందర్, నాయకులు నరేందర్రెద్ది, సంతోష్‌కుమార్, వేమారెడ్డి, యాదాగౌడ్, యాదయ్య, సిద్ధిరాములు, శ్యామ్‌రావు, సురేశ్ పాల్గొన్నారు.