మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులో గేట్ల ఎత్తు పెంచుతుండగా ఒక గేటు కొట్టుకుపోయింది. ఇప్పటికే కృష్ణా నది జలాలను ఏపీ అడ్డగోలుగా తరలిస్తుండగా తాజాగా గేటు కొట్టుకపోవడంతో నిరంతరాయంగా కృష్ణా జలాలు తరలిపోతున్నాయి. రిపేర్లకు టైమ్ పట్టే అవకాశం ఉండటంతో ఇదే అవకాశంగా ఏపీ జలచౌర్యానికి పాల్పడుతున్నది. గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా సమీపంలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ 9వ గేటు ఎత్తుతుండగా అకస్మాత్తుగా ఊడిపోయిoది. ప్రస్తుతం కృష్ణా నది నుంచి నీటిని తరలిస్తున్న ఏపీ తాజాగా పోతిరెడ్డిపాడు గేట్లను మరింత ఎత్తుకు పెంచేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది. దీంతో నిరంతరాయంగా పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలు ఏపీకి పోతున్నాయి. గేట్ మరమ్మతులకు సమయం పట్టనుండగా నీళ్లన్నీ ఏపీకి తరలిపోతున్నాయి. గేటు ఊడిపోవడం ప్రమాదవశాత్తు జరిగిందా? ఏపీనాటక మాడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలను తుంగలోకి తొక్కి ఇప్పటికే శ్రీశైలం నిండకుండా అడ్డుపడి ఏపీ వైపు ఉన్న ప్రాజెక్టులకు నీటిని తరలించుకుపోతున్నా రేవంత్ సర్కార్ మాత్రం కల్వకుర్తి లిఫ్టులను నడిపించడం లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో నాలుగు మోటర్లు సిద్ధంగా ఉన్నా వాటిని పడావు పెట్టి నీటిని ఎత్తుకుపోయేందుకు ఏపీకి సహరిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోతిరెడ్డిపాడు 9వ గేటు పూర్తిగా ఊడిపోవడంతో వేలాది క్యూసెక్కుల నీళ్లు తరలిపోతున్నవి. ఇటీవలే వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించిన ఏపీ.. బనకచర్ల రిజర్వాయర్‌కు రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా ప్లాన్ చేసింది. తాజాగా పోతిరెడ్డిపాడు గేటు కూడా కొట్టుకుపోవడంతో ఏపీకి కృష్ణా జలాలు నిరంతరంగా మళ్లిపోతున్నాయి. కనీసం మిగతా గేట్లను మూయించే ప్రయత్నం కూడా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ చేయడం లేదని తెలిసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): గూడెందొడ్డి రిజర్వాయర్‌ను 1.15 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.180 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఇరిగేషన్‌శాఖ సెక్రటరీ శ్రీధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం గూడెందొడ్డి రిజర్వాయర్‌ను 1.15టీఎంసీలతో గతంలో నిర్మించారు. దీని ద్వారా నెట్టెంపాడు ఆయకట్టుకు నీరు అందుతుంది.
రిజర్వాయర్ సామర్థ్యాన్ని 15టీఎంసీలను పెంచాలని బీఆర్ఎస్ సర్కార్ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇటీవల రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, పంప్ స్టోరేజీ ప్రాజెక్టు (పీఎస్పీ), సోలార్ పవర్ జనరేషన్ చేపట్టాలని క్యాబినెట్లో ఆమోదం తెలిపింది. రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచేందుకు 1,100 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉండగా, రూ.165 కోట్లను కేటాయించింది. పీఎస్పీకి సంబంధించి డీపీఆర్ కు కన్సల్టెన్సీ కోసం రూ.15కోట్లు, మొత్తంగా రూ.180 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది.