న్యూఢిల్లీ, జూలై 29: చిప్‌ల తయారీ సంస్థ మార్వెల్ టెక్నాలజీ..దేశీయ మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే మూడేండ్లలో భారత్‌లో 250 మిలియన్ డాలర్లు లేదా రూ.2,400 కోట్ల పెట్టుబడులను వ్యాపార విస్తరణకు, ముఖ్యంగా టెక్నాలజీ, ప్రతిభ కలిగిన ఉద్యోగులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు చేయబోతున్నట్టు కంపెనీ వైస్ ప్రెసిడెంట్, ఇండియా కంట్రీ మేనేజర్ నవీన్ బిష్ణోయ్ తెలిపారు. దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టి 20 ఏండ్లు పూర్తైన సందర్భంగా టెక్నాలజీని మరింత బలోపేతం చేయడంతోపాటు హైదరాబాద్‌లో ఉన్న కార్యాలయంలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రస్తు తం సంస్థకు బెంగళూరు, పుణె, హైదరాబాద్‌లలో డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి.