సిద్దిపేట, జూలై 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు రైతుల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తున్నాయి. కొం తకాలంగా ఎండలు, వర్షాభావంతో ఇబ్బందులు పడిన రైతులకు వర్షాలు పెద్ద ఊరటనిచ్చాయి. ఇప్పుడిప్పుడే చెరువులు, కుంటలు, వాగులు, వంకల్లోకి నీరు చేరుతుండగా.. పొలా ల్లో తేమశాతం పెరగడంతో వానకాలం సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి.మూడు జిల్లాల్లోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. వర్షపు నీటితో గ్రామీణ ప్రాంతాల్లోని చెరువుల్లోకి నీళ్లు నెమ్మదిగా నిండుతున్నాయి. కొన్ని చోట్ల వాగుల్లో ప్రవాహం కనిపించగా, చిన్న కుంటలు కళకళలాడుతున్నాయి. ఎండిపోయిన భూమి తడిసి ముద్దవడంతో రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 14,80,093 ఎకరాల సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 8,98,178 ఎకరాల్లో సాగు నమోదైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో సంగారెడ్డి జిల్లా లో అత్యధికంగా సాగు నమోదైంది. ఈ జిల్లాలో 5.54,787ఎకరాలు, సిద్దిపేటలో 1,83,710 ఎకరాలు, మెదక్లో 1,59, 681 ఎకరాల్లో సాగైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా సాగైన వివరాలు చూస్తే సిద్దిపేట జిల్లాలో 5,41,550ఎకరాల్లో అన్ని పంటల సాగు లక్ష్యంకాగా ఇందులో 3,85,338 ఎకరాల్లో వరి, 1,18,772 ఎకరాల్లో పత్తి, 28,027 ఎకరాల్లో మొక్కజొన్న, 7,431 ఎకరాల్లో కందులు, 1,982 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.

ఈ జిల్లాలో 20 మండలాలకు పైగా లోటు వర్షపాతం నమోదైంది. కానీ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఆశించిన స్థాయిలో సాగు నమోదు కాలేదు. జిల్లాలో అన్ని పంటలు కలిపి 1,83,710 ఎకరాలు మాత్రమే సాగైంది.దీంటో అత్యధికంగా పత్తి పంట 1,01,009 ఎకరాల్లో సాగు కాగా, 57,093 ఎకరాల్లో మాత్రమే వరి సాగైంది. 24,509 ఎకరాల్లో మొక్కజొన్న, మిగతాది ఇతర పంటలు సాగయ్యాయి. మెదక్ జిల్లాలో సాగు లక్ష్యం 3,42,814 ఎకరాలు కాగా వరి 2,69,043 ఎకరాలు, జొన్న 386 ఎకరాలు, మొక్కజొన్న 4844 ఎకరాలు, కందులు 5577 ఎకరాలు, పెసర్లు 2619 ఎకరాలు,మినుములు 750 ఎకరాలు,సోయాబీన్ 247 ఎకరాలు, పత్తి 51,292 ఎకరాలు, మిగతా ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం సాగు వివరాలు చూస్తే మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం వరి 1,20,000 ఎకరాలు, పత్తి 32,596 ఎకరాలు, కందులు 1,952 ఎకరాలు, పెసర్లు 1,626 ఎకరాలు, మినుములు 1043 ఎకరాలు, మొక్కజొన్న 1693 ఎకరాలు, సోయాబీన్ 769 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో వానకాలం సాగు లక్ష్యం 5,95,729 ఎకరాలు కాగా వరి 19,365 ఎకరాలు, జొన్న 144 ఎకరాలు, మొక్కజొన్న 7424ఎకరాలు, కంది 71,976 ఎకరాలు, పెసర్లు 8223 ఎకరాలు, మినుములు 6250 ఎకరాలు, సోయాబీన్ 71,691 ఎకరాలు, పత్తి 3,56,842 ఎకరాలు, చెరుకు 34,945 ఎకరాలు,ఇతర పంటలు 18,869ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో 3.56 లక్షల ఎకరాల్లో పత్తి, 70,961 ఎకరాల్లో సోయా, 71,961 ఎకరాల్లో కంది, 7, 364 ఎకరాల్లో మొక్కజొన్న, 8,002 ఎకరాల్లో పెసర్లు, 6,250 ఎకరాల్లో శనగ పంటలు సాగు చేయగా 34,249 ఎకరాల్లో చెరుకు పంటలు సాగయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు వరి నాట్లు ముమ్మరంగా వేస్తున్నారు.

సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు కేవలం వాతావరణాన్నే కాదు రైతన్నల ఇంట్లో సంతోషం నింపాయి. చెరువులు నిండితే పంటలు పండుతాయి. పంటలు పండితే పల్లెలు పచ్చబడతాయి. రైతు ఇంట సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతులు ఆందోళన చెందారు. విత్తనాలు సిద్ధం చేసుకున్నప్పటికీ వర్షాలు లేక సాగు ప్రారంభంకోసం ఎదురుచూశారు.
ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో దుకి దున్నడం, నాట్లు వేయ డం వంటి పనులు వేగం పుంజుకున్నా యి. వరి, పత్తి, మొకజొన్న, సోయాబీన్, కందులు తదితర పంటల సాగుకు తగినంత తేమ ఏర్పడింది. చెరువుల్లోకి నీరు చేరితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బోర్లు, బావుల్లో నీటి లభ్యత కూడా మెరుగుపడుతుంది. వర్షాలతో ఒకవైపు వ్యవసాయ రంగానికి ఊతం లభిస్తుంది. కొన్ని రోజులుగా వర్షాలు లేక వానలపై ఆధారపడే మొకజొన్న,పత్తి, సోయాబీన్, కంది పంటలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. ప్రస్తుతం కరుస్తున్న వర్షాలతో పంటలకు జీవం పోసినైట్లెంది.