న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: తక్కువ ధరల్లో వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక టారిఫ్ వోచర్ల (ఎస్టీవీ)ను టెలికాం సంస్థలు అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఓ కొత్త రెగ్యులేషన్‌లో స్పష్టం చేసింది. కాగా, ట్రాయ్ విడుదల చేసిన టెలికాం వినియోగదారుల రక్షణ (13వ సవరణ) నిబంధనలు 2026 ప్రకారం.. ఇప్పుడు డాటా, వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లతో కూడిన ప్లాన్ల తరహాలోనే కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లతో ఉండే చౌక ప్లాన్లను 30 రోజులు, అంతకంటే తక్కువ కాలవ్యవధితో టెలికాం ఆపరేటర్లు తమ కస్టమర్లకు ఆఫర్ చేయాల్సి ఉంటుంది.
అయితే ఈ ఎస్టీవీలు ప్రీ-పెయిడ్ మొబైల్ కస్టమర్లకు బూస్టర్ రిచార్జ్‌ల వంటివి అంటున్న ట్రాయ్.. అదనంగా చెల్లిస్తే తక్కువ ధరల్లో అంతర్జాతీయ కాల్స్‌ను చేసుకొనే అవకాశాన్నీ కల్పించాలని చెప్తున్నది. ప్లాన్‌లో అపరిమిత కాల్స్ ప్రయోజనాన్నీ ఇవ్వాలని టెల్కోలకు స్పష్టం చేసింది.