నర్సాపూర్/అందోల్ /కొల్చారం/చిన్నశంకరంపేట/చిలిపిచెడ్, అక్టోబర్ 28: మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం రాత్రి, మంగళవారం కురిసిన అకాల వర్షానికి ఆరబెట్టిన వడ్లు తడిశాయి. రాత్రి భారీ వర్షం కురవడంతో ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. సోమవారం వర్ష సూచనలు లేకపోవడంతో రైతులు టాపర్లలో ఆరబెట్టిన ధాన్యాన్ని కుప్ప చేయకుండా అలాగే ఉంచారు. దీంతో రాత్రి కురిసిన వాననీటికి వడ్లు కొట్టుక పోయాయి. మెదక్ జిల్లా కొల్చారంలో ఆశన్నగారి యాదమ్మకు చెందిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది.
ఆరబెట్టిన దగ్గర నుంచి నాలుగైదు గజాల దూరం వరకు కొట్టుకుపోవడంతో ఉదయం వచ్చి చూసిన మహిళా రైతు విలపించింది. చీపురుతో మట్టిలో మేట వేసిన ధాన్యాన్ని ఊడ్చి కుప్పచేసుకుంది. ధాన్యం వాననీటికి కొట్టుకుపోయిన చోట సుమారు మీటరు లోతు మట్టి గుంతలో వడ్లు కలిసిపోయాయి. పలువురు రైతులు గంపల ద్వారా ధాన్యాన్ని తవ్వుతున్న దృశ్యం కనిపించింది. ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నారు.
రైతులు మూడునాలుగు రోజులుగా ఆరబెట్టినా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా 20, 25 శాతం కంటే ఎక్కువ ఆరటం లేదు. దీంతో తేమ శాతం 20 వచ్చినప్పటికీ మళ్లీ ఆరబెట్టాల్సిన పరిస్థితి ఉండడంతో ధాన్యం కుప్ప చేయకుండా అలాగే ఉంచారు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఆరిన ధాన్యం సైతం పూర్తిగా తడిసిపోయింది. తేమ శాతం నిబంధన తమ పాలిట గండంగా మారిందని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. కొన్ని చోట్లలో ఆరిన ధాన్యం ఉన్నప్పటికీ సకాలంలో తూకం ప్రారంభించకపోవడంతో వర్షానికి తడిసి మళ్లీ ఆరబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా తూకం ప్రారంభించి వెంట వెంటనే ధాన్యాన్ని తరలించాలని నర్సాపూర్ రైతులు కోరుతున్నారు.

చిన్నశంకరంపేటలో…
మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది. చేతికి అందిన పంట నేలపాలు అయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు తడిసి పోయాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నర్సాపూర్‌లో…
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఖాజీపేట్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారులు, సిబ్బంది ఇప్పటి వరకు కాంటా చేయడం లేదు. ఈనెల 27న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్ ప్రకటించారు. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోగా, మళ్లీ సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం మళ్లీ తడిసింది. అధికారులు కనీసం టార్పాలిన్లు పంపిణీ చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాజీపేటలో సోమవారం కురిసిన భారీ వర్షానికి రైతులు తీసుకువచ్చిన ధాన్యం పూర్తిగా నీటిపాలైంది.
అందోల్‌లో…
సోమవారం రాత్రి, మంగళవారం కురిసిన వర్షానికి అందోల్, సంగుపేట, అల్మాయిపేట్తో పాటు పలు గ్రామాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసింది. ధాన్యంపై రైతులు ప్ల్లాస్టిక్ కవర్లు, సంచులు కప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. అధికారులు ధాన్యం నిల్వచేసేందుకు సరైన ఏర్పాట్లు, చేయలేదు. టార్పాలిన్లు అందజేయక పోవడంతో ధాన్యం
పూర్తిగా తడిసి నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జోగిపేట మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణం అయ్యింది. రైతులు కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు తీసుకువచ్చిన ధాన్యం యార్డు ఆవరణలో ఆరబెట్టారు. భారీ వర్షం పడడంతో ధాన్యం తడిసిపోయింది. కొంత ధాన్యం నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు కన్నీటి పర్యంతం అయ్యారు. అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదని, ధాన్యాన్ని సైతం సరైన సమయానికి కొనడం లేదని రైతులు ఆరోపించారు.
చిలిపిచెడ్ మండలంలో…
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం,పత్తి చేతికొచ్చాక వర్షం పాలైంది. చిలిపిచెడ్ మండలంలో కురిసిన అకాల వర్షానికి ఆయా గ్రామాల్లో మంగళవారం ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఇప్పటికే పత్తి, ఇతర పంటల్లో నష్టం వచ్చి దిగాలుతో ఉన్న రైతులు మళ్లీ వర్షానికి పత్తి,కోసిన ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చిట్కుల్లో మెదక్-సంగారెడ్డి రోడ్డుపై వర్షపు నీటికి ధాన్యం కొట్టుకుపోయింది. జగ్గంపేట, చండూర్లో ధాన్యం తడవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.
వెల్దుర్తిలో…
వరి పంట కోతలు మొదలు కావడంతో రైతులు ధాన్యాన్ని ఖాళీ ప్రదేశాలలో ఆరబోస్తున్నారు. సోమవారం రాత్రి, మంగళవారం సాయంత్రం కురిసిన వర్షాలకు ఆరబోసిన ధాన్యం తడిచింది, మండల కేంద్రాలైన వెల్దుర్తి, మాసాయిపేటలతో పాటు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది, ఒక్కసారిగా వర్షం కురవడంతో ఆరబోసిన ధాన్యంతో పాటు ధాన్యం రాశులు తడిచిపోయాయి, పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని, ప్రారంభం అయిన కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
వారం రోజులైనా వడ్లు కొంటలేరు..
నర్సాపూర్‌లోని పీఏసీఎస్ కేంద్రానికి వడ్లను తెచ్చి వారం గడుస్తున్నా తూకం వేయడం లేదు. కనీసం టార్పాలిన్లు ఇవ్వడం లేదు. మూడు రోజుల క్రితం వడ్లు తడిసిపోయాయి. ఆరబెట్టగా సోమవారం రాత్రి కురిసిన వర్షానికి మళ్లీ తడిశాయి. లారీ లోడ్ ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చాను. తూకం వేయడానికి ఏ ఒక్కరూ అందుబాటులో లేరు. తూకం వేయడానికి హమాలీలు ఇంకా కేంద్రానికి రాలేదు. ఇప్పటికైనా కేంద్రాన్ని ప్రారంభించి వడ్లను కొనుగోలు చేయాలి.
– బేగంపేట నరేశ్, రైతు, ఖాజీపేట్ (మెదక్ జిల్లా)