సిద్దిపేట అర్బన్, జూన్ 25: రైతుభరోసాపై రైతుల అభిప్రాయ సేకరణ కోసం అధికారులు మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సిద్దిపేట మండల పరిధిలోని మిట్టపల్లి రైతువేదికలో జరిగిన సమావేశంలో రైతులు అధికారులకు అభిప్రాయాన్ని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఎకరానికి రూ.7500, కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి.. ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి.. ఎవరికి ఇవ్వద్దు.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలా.. వద్దా.. వంటి అభిప్రాయాలను రైతుల నుంచి సేకరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగా సమయానికి రైతుభరోసా ఇవ్వాలని ముక్త కంఠంతో తెలిపారు. ఎన్ని ఎకరాలు రైతుకు ఉన్నా పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని మెజారిటీ రైతులు తమ అభిప్రాయాలు తెలిపారు. అదే విధంగా రైతుభరోసాపై కాలయాపన చేయకుండా వానకాలం, యాసంగి సీజన్ల ప్రారంభంలోనే పెట్టుబడి నిధులు వేస్తే రైతులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా పంటలు సాగు చేసే సమయంలోనే రైతుబంధు వేసిందని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని పలువురు అసహనం వ్యక్తం చేశారు.
రైతుభరోసాపై అభిప్రాయ సేకరణలో భాగంగా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి రైతువేదికలో అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి కరెంట్ లేకపోవడంతో ఇన్వర్టర్ సాయంతో వీడియో కాన్ఫరెన్స్‌ను నడిపించారు. కరెంట్ లేకపోవడంతో ఫ్యాన్లు, కూలర్లు నడవకపోవడంతో రైతులు, అధికారులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. దీంతో కొందరు వ్యవసాయ అధికారులు, రైతులు కర్చిఫ్, పుస్తకాలు, పేపర్ల సాయంతో గాలి ఊపుకుంటూ కనిపించారు.