పత్తి వ్యాపారుల మాయాజాలంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు, రసాయన మందులను వ్యాపారుల వద్ద వడ్డీకి తీసుకురావడంతో పల్లెల్లో వారి పెత్తనం పెరిగింది. మార్కెటింగ్ లైసెన్స్ లేకుండానే గ్రామాల్లో బహిరంగంగానే పత్తి కొనుగోలు చేస్తున్నారు. సర్కార్ నిబంధనల ప్రకారం వ్యాపారులైనా, ప్రభుత్వరంగ సంస్థలైనా అధికారుల పర్యవేక్షణలో పంట ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు గత్యంతరం లేక వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో పుట్టగొడుగుల్లా పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. సీసీఐ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,020 ప్రకటించగా.. వ్యాపారులు మాత్రం రూ.6,500కే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం తమకు అండగా నిలవాలని అన్నదాతలు కోరుతున్నారు.
జహీరాబాద్, డిసెంబర్ 22: పత్తి వ్యాపారుల మాయాజాలంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. విత్తనాలు వేసే సమయంలో అన్నదాతకు విత్తనాలు, ఎరువులు, రసాయన మందులను రైతులకు పత్తి వ్యాపారులు వడ్డీకి ఇస్తారు. పంట చేతికి రాగానే వడ్డీతోసహా రైతు నుంచి వసూలు చేస్తారు. రైతులు పండించిన పత్తిని వ్యాపారులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు చెప్పిన ధరకు రైతులు విక్రయిస్తున్నారు. తేమపేరుతో మార్కెట్లో ఉన్న ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. పత్తి వ్యాపారులు మార్కెట్ ఫీజ్ చెల్లించకుండానే వ్యాపారం చేస్తున్నారు. జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో న్యాల్కల్, ఝరాసంగం, మొగుడంపల్లి, కోహీర్, జహీరాబాద్ మండలాలు ఉన్నాయి. పత్తి కొనుగోలు చేసేందుకు న్యాల్కల్ మండలంలోని న్యాల్కల్, ముంగి, గంగ్వార్, ఝరాసంగంతోపాటు పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వ్యాపారులు మార్కెట్ కమిటీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొనుగోలు చేసి గుజరాత్‌కు పత్తిని లారీల్లో తరలిస్తున్నారు. మార్కెటింగ్, రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేయకపోవడంతో వ్యాపారులు యథేచ్ఛగా లారీల్లో పత్తిని తరలిస్తున్నారు.
జహీరాబాద్ ప్రాంతంలో పత్తి వ్యాపారులు మార్కెట్ ఫీజు చెల్లించకుండానే పత్తి కొనుగోలు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో వ్యాపారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారుల మాయాజలంతో ప్రతి ఏడాది రైతులకు దుఃఖమే మిగులుతోంది. సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. సీసీఐ మద్దతు ధరకు, వ్యాపారులు కొనుగోలు చేసే ధరకు రూ. రూ.1000 నుంచి రూ.1500 వరకు తేడా ఉంటుంది. రైతులకు మద్దతు ధర కలిపించకపోవడంతోపాటు తూకంలో మోసాలు చేస్తున్నారు. అక్రమ వ్యాపారాన్ని అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డులు నామమాత్రంగానే మిగిలాయి. సర్కార్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యాపారులైనా, ప్రభుత్వ రంగ సంస్థలైనా అధికారుల పర్యవేక్షణలో పంట ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. మార్కెంటింగ్ శాఖ అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. జహీరాబాద్ మార్కెట్లో విశాలమైన స్థలం ఉన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదు. ఎలక్ట్రానిక్ కాంటాలు సరుకు నిల్వ చేసేందుకు గోదాములు, ప్లాట్‌ఫాంలు ఉన్నా పత్తి కొనుగోలు చేయడం లేదు. వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని రాయికోడ్, మునిపల్లి మండలంలో ఉన్న జిన్నింగ్ మిల్లులోనే రైతులపేరుతో అమ్మకాలు చేస్తున్నారు. వాతావరణం చల్లగా ఉండడంతో తేమపేరుతో సీసీఐ ప్రకటించిన ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర క్వింటాలకు 7,020 ఉండగా, తేమపేరుతో రూ. 6,500 నుంచి రూ.6,700 వరకు ఇస్తున్నారు. పత్తి వ్యాపారులు లైసెన్స్ తీసుకోకుండా వ్యాపారం చేస్తున్నారు. తూకంలో మోసాలు చేస్తున్నారు. వ్యాపారులు హమాలీ పేరిట డబ్బులు వసూళ్లు
చేస్తున్నారు.
వానకాలంలో రైతులు అధికంగా పత్తి పంటను వర్షాధారంగా, నీటి సౌకర్యంతో సాగు చేశారు. వేలాది రూపాయిలు పెట్టుబడులు పెట్టి కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చిన రైతులకు భారీగా వానలు కురవడంతో పత్తి పంటకు తీవ్ర నష్టం జరిగి దిగుబడి తగ్గిపోయింది. పూత, కాయాలు సైతం రాలిపోయిన్నాయి. వర్షాలు ఎక్కువగా కురవడంతో పూత, పిందె రాలిపోయి ఎకరానికి నాలుగైదు క్వింటాళ్ల మేర అన్నదాతలకు నష్టం జరిగింది. పంట దిగుబడి తగ్గినప్పటికీ డిమాండ్‌కు అనుగుణంగా ధరలు పెరగలేదు. దీనికి కారణం వ్యాపారులు సిండికేట్ కావడంతోపాటు పొరుగు రాష్ర్టాలకు వ్యాపారులు పత్తి వెళ్లికుండా లాబీయింగ్ చేశారు. గుజరాత్లో నాణ్యమైన పత్తి క్వింటాల్‌కు రూ.9వేల పైబడి ధర పలుకుతున్నా జహీరాబాద్ ప్రాంతంలో వారం రోజుల వరకు రూ. 6,500 వరకు వ్యాపారులు అన్నదాతల నుంచి పత్తిని కొనుగోలు చేశారు. వ్యాపారులకు పోటీగా పత్తిని కొనుకోలు చేయవలసిన సీసీఐ కేంద్రాలు తెరవకపోవడంతో దళారులు కొన్నదే ధర. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని వ్యాపారులు తక్కువ ధరలు పెట్టి భారీస్థాయిలో పత్తి నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం రైతుల వద్ద పత్తి నిల్వలు తగ్గగానే ధరలు పెంచుకుంటూ పోతున్నారు. జనవరిలో క్వింటాలు పత్తి ధర రూ.8 వేలకు పైగానే చేరుతుందని వ్యాపారులు తెలుపుతున్నారు. ఆరుగాలం శ్రమించిన రైతులకు పెట్టిన పెట్టుబడులు రాకుండా నష్టపోగా, కేవలం నెలరోజుల వ్యవధిలో నిల్వ చేసిన వ్యాపారులు క్వింటాల్ పత్తికి రూ.1,500లకు పైగానే లాభం సంపాదించడం గమనార్హం. పత్తి రైతులకు గిట్టుబాటు ధర కలిపించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు. రైతులు కష్టపడి పంటలు పండించినా గిట్టుబాటు ధర లేక నష్టపోతుంటే వ్యాపారులు నెలరోజులో లక్షలు సంపాదిస్తున్నారు. మార్కెట్ మాయాజాలంతో రైతులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు.