మద్దూరు(ధూళిమిట్ట), మే 5: ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో భాగంగా తొలుత అన్ని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో లబ్ధిదారుల అవగాహన కోసం ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాలను చేపట్టింది. దీనిలో భాగంగా సిద్దిపేట జిల్లా మద్దూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మూడు నెలల క్రితం ప్రారంభించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పను లు నత్తనడకన కొనసాగుతున్నాయి.
నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికితోడు నిర్మాణ పనులు నాసిరకంగా కొనసాగుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలకు అధికారులు తిలోదకాలు ఇచ్చారు. కనీసం క్యూరింగ్ కూడా సరిగ్గా చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మోడల్ హౌస్ నిర్మాణ పనులు ముందుగా పూర్తయితే అదే రీతిన ఇండ్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు అవగాహన కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం అలాంటి అవకాశం లేకుండా పోయింది.
మోడల్ హౌస్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడం వల్లనే పనులు నత్తనడకన సాగుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై హౌసింగ్ డీఈ శంకర్‌ను వివరణ కోరగా కూలీలు దొరకకపోవడం వల్ల నిర్మాణ పను ల్లో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, 15 రోజుల వ్యవధిలో మోడల్ హౌస్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.