మెదక్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో దాదాపు లక్ష వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ముందుచూపుతో వ్యవసాయ అనుకూల విధానాలతో గత ఎనిమిదేండ్లలో వ్యవసాయ స్వరూపం మారిపోయింది. సీఎం కేసీఆర్ విద్యుత్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లో విద్యుత్‌పై సమీక్షించి రైతులకు నాణ్యమైన 9 గంటల కరెంటును అందుబాటులోకి తెచ్చారు. 2018 జనవరి 1 నుంచి వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. రాష్ట్రం ఏర్పడే నాటికి పగటిపూట మూడు గంటలు, రాత్రిపూట మూడు గంటలు విద్యుత్‌ను కూడా ఇబ్బందులు ఎదురొన్న పరిస్థితుల నుంచి నేడు 24 గంటల ఉచిత విద్యుత్ పొందేలా చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దకుతుంది. 2014వ సంవత్సరంలో అతి తక్కువ వ్యవసాయ విద్యుత్ సర్వీస్‌లు ఉండగా, ఇప్పుడు లక్షల్లో వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి.
మెదక్ జిల్లాలో 1.2 లక్షల విద్యుత్ కనెక్షన్లు..
మెదక్ జిల్లాలో 1,02,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గత ప్రభుత్వాల హయాంలో కరెంటు సక్రమంగా రాక రైతులు బోరు బావుల వద్ద తీవ్ర ఇబ్బందులు పడేవారు. అంతేకాదు బోరు బావుల వద్ద వరి సాగు చేసిన తర్వాత కరెంటు కోసం రైతులు ఎదురుచూసేవారు. ఒకవేళ కరెంటు వస్తే రాత్రి పూట పొలాల వద్దకు వెళ్లి రాత్రంతా నీటిని పారించేవారు. అయితే రాత్రి సమయాల్లో పొలాల వద్ద రైతులు పాటు కాటుకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అంతే కాదు త్రీ ఫేజ్ కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు రాదో తెలియని పరిస్థితి దాపురించేది. దీంతో లోవోల్టేజీ సమస్యతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో రైతులు వేసిన పంట చేతికొచ్చే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యేది.
మెదక్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు..
తెలంగాణ రాష్ట్రం అంతటా 2017 డిసెంబర్ 31 అర్థ్ధరాత్రి నుంచి 24 గంటల ఉచిత కరెంటు అమలులోకి వస్తే.. మెదక్ జిల్లాలో 2018 జనవరి ఒకటి నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అయితే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలుకు మెదక్ జిల్లాలోనే ప్రయోగాత్మకంగా అమలు చేసి సాంకేతిక సమస్యలను పరిశీలించారు. జిల్లాలో విజయవంతంగా కావడంతోనే రాష్ట్రమంతటా అమలు చేసింది. మెదక్ జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లు 1,02,316 ఉండగా, 2018 కంటే ముందు 89,479 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అంటే 2018 డిసెంబర్ నుంచి 2022 డిసెంబర్ వరకు 12,837 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెరిగాయి. 2018 కంటే ముందు 19,761 ట్రాన్స్ఫార్మర్లు ఉండగా, 2018 నుంచి డిసెంబర్ 2022 వరకు 4,249 కొత్త ట్రాన్స్ఫార్మర్లను బిగించారు. దీంతో డిసెంబర్ 2022 నాటికి 24,010 ట్రాన్స్ఫార్మర్లు జిల్లాలో ఉన్నాయి. ఇకపోతే లక్షల్లో విద్యుత్ స్తంభాలను వేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో వంగిన, తుప్పుపట్టిన స్తంభాలను తొలిగించి కొత్త వాటిని అమర్చారు.