కండ్లముందే పంటలు ఎండిపోతున్నాయి.... ఎండిన పంటలను ఇప్పటికే అనేక మంది రైతులు గొర్లు, బర్లు, ఆవుల మేతకు వదిలివేశారు.. వ్యవసాయాధికారులు ఎండిన పంటలను క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ సాగునీరు అందక రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
ఎండిన పంటలపై అధికారుల సర్వే
వరి మాత్రమే నమోదు చేస్తున్న అధికారులు
మొక్కజొన్న తదితర పంటలపై మౌనం
హుస్నాబాద్ టౌన్, మార్చి 31: కండ్లముందే పంటలు ఎండిపోతున్నాయి…. ఎండిన పంటలను ఇప్పటికే అనేక మంది రైతులు గొర్లు, బర్లు, ఆవుల మేతకు వదిలివేశారు.. వ్యవసాయాధికారులు ఎండిన పంటలను క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ సాగునీరు అందక రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ తరుణంలో మమ్ముల్ని ఆదుకోవాలంటూ సర్కారును రైతులు వేడుకుంటున్నారు. గత పదేండ్లుగా వ్యవసాయం పండుగలా మారింది. ఈ ఏడాది రబీసీజన్ నుంచి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతుండడంతో వేసిన వరి, మొక్కజొన్న, వేరుశనగ, కూరగాయలతోపాటు అనేక పంటలు ఎండిపోతున్నాయి. కనీసం వరుస తడులు కూడా పారక పొట్టచేతికి వచ్చిన సమయంలో వరిపొలాలు ఎండిపోయాయి. దీంతో వ్యవసాయం చేసేందుకు అప్పులు తీసుకువచ్చిన రైతులకు వాటిని ఎలా తీర్చలా అర్థం కాని పరిస్థితి నెలకొంది. బ్యాంకుల్లో ఇప్పటికే వ్యవసాయ రుణాల బా కీలు వెంటాడుతున్న క్రమంలో యాసంగి పంటకోసం తీసుకువచ్చిన అప్పులు తీర్చేదారి కనిపించక రైతులుఆవేదనకు గురవుతున్నారు.
ఎండిన వరిపంట మాత్రమే నమోదు
ప్రస్తుత సీజన్లో ఎండిన పంటలపై సర్వే చేస్తున్నామని వ్యవసాయాధికారులు పైకి చెబుతున్నప్పటికీ వాస్తవంగా ఎండిన వరిపంటను మాత్రమే నమోదు చేస్తున్నారు. వరి, మొక్కజొన్న, వేరుశనగ, దోస, పొద్దుతిరుగుడు, బబ్బెరతోపాటు రైతులు కూరగాయల సాగు ను సైతం చేపట్టారు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో వేసిన అన్ని పంటలు చేతికి రాకుండా పోయాయి. కానీ వ్యవసాయాధికారులు మాత్రం ఎండిన వరిపంటను మాత్రమే నమోదు చేస్తామని చెబుతుండటంతో మిగతా పంటలు వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్కువ నీటితో పంటలు పండించడమే మా తప్పా అని రైతాంగం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. ఎండిపోయిన అన్ని పంటలను సర్వేచేసి ఆదుకోవాలని రైతాంగం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నది.
పంటలు ఎండిపోయాయి
ఐదెకరాల భూమిలో నీళ్లు సక్కగా ఎల్లుతాయో లేదోనని రెండు ఎకరాల్లో మక్కపెట్టా. తలపువ్వుకు పీసువచ్చేటైంలా ఎండిపోయిం ది. ఒకనెల అయితే చేతికి వచ్చేది. ఎకరంన్నర పల్లిసేను కూడా వేశా. ఆదికూడా బండబాయిల సరిగ్గా నీళ్లు ఎల్లక ఎండిపోయింది. ఎనభైవేలు అప్పుతీసుకువచ్చి పెట్టా. పంట పండినంక మళ్లీకడుదామని అనుకున్నా. నేను అప్పు ఎట్లకట్టాలే. మా ముగ్గురు బిడ్డలను ఎలా చదివించాలో అర్థంకావడం లేదు.
-దొంతరబోయిన ఆంజనేయులు, రైతు, హుస్నాబాద్
పంటలు చేతికి రాకుండా పోయాయి
ఎకరంన్నర వరి, ఇరువై గుంటల దోస పెట్టా. వేల రూపాయల పెట్టుబడి పెట్టి పంట పెడితే వరి, దోస పంట మొత్తం ఎండిపోయింది. 19 గజాల బాయి కూడా ఎండిపోయింది. అండ్ల వేసిన నిలువు బోరు కూడా దెబ్బతిన్నది. ఇగ అప్పులు తెచ్చి పంటలు సాగుచేస్తే చేతికి రాకుండానే పోయాయి. మాలాంటి రైతులకు సాయం అందించి సర్కారు ఆదుకోవాలి.
– గొర్ల అజయ్, రైతు హుస్నాబాద్
వివరాలు సేకరిస్తున్నాం
హుస్నాబాద్ ప్రాంతంలో ఎండిపోయిన పంటలపై అంచనా వేస్తు న్నాం. మాకు ఉన్న ఆదేశాల ప్రకా రం ఎండిపోయిన వరి పంట వివరాలు సేకరిస్తున్నాం. దీనిపై అన్ని మండలాల ఏవో, ఏఈవోలకు ఆదేశాలు ఇచ్చాం. సాయంత్రం వరకు ఎండిపోయిన వరిపంటపై సమాచారం వస్తుంది. దీన్ని పై అధికారులకు పంపిస్తాం. ఇతర పంటల సమాచారం సేకరించడంలేదు.