ఈ నెల 19న సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో ఆదివారం మెదక్ కలెక్టర్ రాజర్షిషా పనులను పరిశీలించి పలు సలహాలు, సూచనలు చేశారు. పెండింగ్ పనులను రెండు రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను
ఆదేశించారు.
– మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు, 13
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 13: ఈనెల 19న జిల్లా కలెక్టరేట్ నూతన భవనంతో పాటు ఎస్పీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో కలెక్టర్ రాజర్షి షా, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. కలెక్టరేట్లోని భవనంలో విద్యుత్తు, గార్డెన్, మిగిలిన పనులను రెండు రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ వెంట డీఎస్పీ ప్రాణిధర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్‌సాగర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు జూబేర్, నవీన్, అహ్మద్ తదితరులు ఉన్నారు.