సిద్దిపేట, జూన్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘వానలు వాపసు రావాలి.. కోతులు అడవులకు వెళ్లాలి. మొక్కలు నాటుదాం.. అడవులను కాపాడుదాం.. పర్యావరణాన్ని రక్షించుకుందాం.. హరిత తెలంగాణను నిర్మిద్దాం’.. అనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగా కోట్లాది మొక్కలు నాటి సంరక్షించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ 8 విడతల్లో జరిగిన హరితహారం కార్యక్రమంలో సుమారు 15 కోట్ల వరకు మొక్కలు నాటి సంరక్షించింది. దీంతో సత్ఫలితాలు కనిపించాయి. రహదారుల వెంట, ఖాళీ స్థలాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, పల్లెలు, పట్టణాల్లో హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించాయి. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని అమలు చేయగా.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో పచ్చనిచెట్లు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం పసిపాపలా కాపాడిన హరితహారం చెట్లను ఇవాళ కాంగ్రెస్ హయాంలో ఎక్కడికక్కడ నరికివేస్తున్నారు. కండ్ల ముందు చెట్లు మొండెంలా మారుతున్నాయి. దీంతో ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా హరితహారం చెట్లను నరికివేస్తున్నా అధికార యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కావాలనే చెట్లను నరికి వేయిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ వైర్లకు తగులుతున్నాయి అనే సాకుతో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఇటీవల అనేక చోట్ల విద్యుత్‌శాఖ సిబ్బంది ఇష్టారీతిగా చెట్లను నరికివేశారు. ఏపుగా పెరిగిన చెట్లు నీడనిస్తున్నాయి. ఫలాలను అందిస్తున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా పచ్చని తోరణాలు కట్టినట్లుగా స్వాగతం పలుకుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్నాయి. ప్రస్తుతం కక్ష కట్టినట్లుగా చెట్లను నరికివేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హరితహారం కింద మొక్కలు నాటుడు దేవుడెరుగు కానీ… ఉన్న చెట్లను నరికి వేయకుండా కాపాడితే అది పదివేలు అంటున్నారు ప్రకృతి ప్రేమికులు. సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రహదారికి ఇరువైపులా హరితహారంలో నాటిన మొక్కలను ఎక్కడికక్కడ నరికివేస్తున్నారు. ఇటీవల సిద్దిపేట పట్టణంలో విద్యుత్ సిబ్బంది హరితహారం చెట్లను నరికివేయగా స్థానిక మున్సిపల్ అధికారులు నోటీసులు పంపారు. రూ.24 లక్షలు జరిమానా కట్టాలని నోటీసులో పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలో, కంది, మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో పలుచోట్ల ఇష్టారీతిన చెట్లను ఇటీవల నరికివేశారు. బీఆర్ఎస్ హయాంలో హరితహారం చెట్ల జోలికి వస్తే జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవడంతో పచ్చనిచెట్లు రంపపు కోతకు గురవుతున్నాయి.
తెలంగాణ హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసినట్లు కనిపిస్తున్నది. కండ్ల ముందు హరితహారంలో చెట్లు కాలిపోతున్నా, నరికివేతకు గురవుతున్నా పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పసిపిల్లల్లా సాకిన మొక్కలు నేడు మొండెంతో కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయి. గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణను పట్టించుకోవడం లేదు. గతేడాది హరితహారం ఎనిమిదో విడతలో ఉపాధిహామీ పథకంలో లక్షల మొక్కలను నాటారు.తెలంగాణ హరితహారంలో భాగంగా ఇరిగేషన్ ల్యాండ్, కమ్యూనిటీ ప్లాంటేషన్, ఇన్సిట్యూట్ ప్లాంటేషన్,అవెన్యూ ప్లాంటేషన్ కింద ఈత మొక్కలు, నీలగిరి తదితర మొక్కలను నాటి ప్రతి మొక్కనూ బీఆర్ఎస్ ప్రభుత్వం బతికించింది. ఇప్పుడేమో చెట్లను ఎక్కడికక్కడ నరికివేస్తున్నారు. మరికొన్ని చోట్ల నీళ్లులేక ఎండిపోతున్నాయి. చాలాచోట్ల మంటపెట్టడంతో చెట్లు కాలిపోయి కనిపిస్తున్నాయి. ఇటీవల సిద్దిపేట జిల్లా ములుగు వద్ద రాజీవ్ రహదారిపై వందలాది హరితహారం మొక్కలు కాలిబూడిదయ్యాయి. దీంతో పర్యావరణ పరిరక్షణకు తూట్లు పడుతున్నాయి.