సిద్దిపేట,అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయింపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లు ఎటూ తేలలేదు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుందోనని ప్రజలతో పాటు ఆశావహులు, రాజకీయ పార్టీలు, నేతలు టీవీలకు అతుక్కుపోయి బుధవారం రోజంతా ఎరురుచూశారు. తీరా చివరకు హైకోర్టు తీర్పు గురువారం(నేటికి) వాయిదా వేయడంతో అందరిలో మరింత ఉత్కంఠ నెలకొంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడుదామని ఆశగా ఎదరుచూసిన జనరల్ కేటగిరీకి చెందిన ఆశావహులకు ఇంకా ఊరట లభించడం లేదు. అసలు ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే సందేహాలు వీడడం లేదు. ఎటూ పాలుపోని స్థితిలో ఆశావహులు ఉన్నారు. అంతా గందరగోళంగా పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీపై స్టే ఇవ్వాలని హైకోర్టులో పిటిషనర్ కోరారు. కానీ, పిటిషనర్ వినతిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. కోర్టు విచారణ వాయిదా పడిన నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల విషయంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా ముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గురువారం (నేడు) నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం.
సిద్దిపేటలో 26 జడ్పీటీసీ, 230 ఎంపీటీ సీ స్థానాలు, మెదక్ జిల్లాలో 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలు, సంగారెడ్డి జిల్లాలో 25 జడ్పీటీసీ, 261 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 72 జడ్పీటీసీ, 681 ఎంపీటీసీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి విడత ఎన్నికల్లో భాగంగా నేటి నుంచి ఈనెల 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12 నామినేషన్ల పరిశీలన, 15న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. తొలిదశ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 23న జరుగుతుంది. రెండో దశ ఎన్నికలకు నామినేషన్లను అక్టోబర్ 13 నుంచి 15వ తేదీ వరకు స్వీకరిస్తారు. 16న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 19న ఉపసంహరణ, 27న ఓటింగ్ నిర్వహిస్తారు. రెండు విడతల్లో నిర్వహించిన ఓట్ల లెక్కింపు నవంబర్ 11న చేపడుతారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారుల(కలెక్టర్ల)కు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు పకడ్బందీగా జరగాలని, ముందుగా క్షేత్ర స్థాయిలో సమీక్షించుకోవాలని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణలో సహకరించాలని, సున్నిత ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో మొదటి విడతలో 15 జడ్పీటీసీలు, 125 ఎంపీటీసీ స్థానాల నోటిఫికేషన్‌కు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో రమేశ్, డీపీవో దేవకీదేవి,డీఆర్డీవో జయదేవ్ ఆర్య తదితరులు పాల్గొన్నారు.
నేడు తొలి విడత
ఉమ్మడి మెదక్ జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ 29న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నేడు తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలుత
జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ దిశగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.
తొలి విడతలో సిద్దిపేట, గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 15 మండలాల్లో, మెదక్ జిల్లాలోని మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు.