నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత సరిగ్గా లేదని నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి సంజాయిషీ ఇవ్వాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి డీఈఓ రాధాకృష్ణను ఆదేశించారు. మంగళవారం తెలంగాణ గోలి శ్రీనివాస్ రెడ్డి, సభ్యురాలు భూక్య జ్యోతి ఇతర సభ్యులు నర్సాపూర్ పట్టణంలోని రేషన్ దుకాణాలను పరిశీలించి పట్టణంలోని ఎంఎల్ఎస్ పాయింట్, రెడ్డి పల్లి లోని అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రెడ్డిపల్లి గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యత సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రత, నాణ్యత, ప్రారంభ నిలువలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగా ఉండాలని, విద్యా వసతులు, పిల్లల హాజరు శాతం, నిర్వహణ సక్రమంగా ఉండాలని అధికారులకు సూచించారు.