‘మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి గెలుపు.. రాష్ట్రంలో కేసీఆర్ గెలుపును ఎవరూ ఆపలేరు. ఈ రెండు కూడా ఖాయమైపోయాయి. ఇంత మంచిగా కేసీఆర్ ప్రజలకు ఏం కావాలో ఆలోచిస్తూ, పనిచేస్తున్నప్పుడు.. ఇతర పార్టీలకు ఓటేసి రిస్క్ ఎందుకు తీసుకోవాలి అని రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏది కావాలన్నా సీఎం దగ్గరకు వెళ్లి తెచ్చిస్తామనే భరోసా ఉన్నది. కాంగ్రెసోళ్లు ఏది కావాలన్నా ఢిల్లీకి పోవాలే. అక్కడ నుంచి తెచ్చుకోవాలే’.. అని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మెదక్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): మెదక్‌లో పద్మమ్మ గెలుపు.. రాష్ట్రంలో కేసీఆర్ గెలుపును ఎవరూ ఆపలేరని.. ఈ రెండు కూడా ఖాయమైపోయాయని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎన్నికల ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇంత మంచిగా కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో ఆలోచిస్తూ, పని చేస్తున్నప్పుడు ఇతర పార్టీలకు ఓటేసి రిస్క్ ఎందుకు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు.. అడగకున్నా, ఎన్నికల్లో చెప్పకపోయినా పంట పంటకు రైతు బంధు ఇస్తున్న కేసీఆర్ ఉండగా ఇతర పార్టీలకు ఎందుకు ఓటేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాష్ర్టాల్లో ఎక్కడా సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వ తరహాలో అమలుచేయలేదన్నారు. మరి ఆనాడు చేయలేదు.. దేశంలో ఉన్న ఇతర రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న చోట కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఆసరా పింఛన్ పెంచాలన్నా, రైతు బంధు పెంచాలన్నా, కల్యాణ లక్ష్మి పెంచాలన్నా మెదక్‌లో అయితే పద్మమ్మనో, సిద్దిపేటలో అయితే తననో కలిసి ప్రజలు అడుగుతారు. వెంటనే తాము వెళ్లి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి దాన్ని తెచ్చి ఇవ్వగలుగుతాం.. కానీ కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి ఏదీ కావాలన్నా ఢిల్లీకి వెళ్లాలి.. టికెట్ కావాలన్నా ఢిల్లీకే పోవాలి.. ప్రచారం చేయాలన్నా ఢిల్లీ నుంచే నాయకులు రావాలి.. ఆసరా పింఛన్లు పెంచాలన్న ఢిల్లీ నాయకుల్నే అడగాలి.. అందుకే ఢిల్లీ పార్టీలను నమ్ముకుని మోసపోవద్దని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లను తక్కట్ల పెట్టి అమ్ముకుంటుండ్రని, అర్రాస్ పాట పాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇచ్చిన టికెట్లకే ఆగమాగం అవుతున్నది. రేపు రాష్ర్టం వీళ్ల చేతులోకి వెళితే ఏమైపోతదో.. కుక్కలు చింపిన విస్తరాకులాగా అవుతుంది. ఏబుల్ లీడర్ స్టేబుల్ గవర్నమెంట్ కేసీఆర్ చేతుల్లోనే ఉంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం ముందుకు పోతుంది. పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎంతో సురక్షితంగా ఉంటుందో.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ రాష్ట్రం సాధించిన కేసీఆర్ చేతుల్లో ఉంటేనే బాగుంటుంది.. ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకుపోతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి.. కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలి.. అని మంత్రి హరీశ్‌రావు అన్నారు.