‘మన ఊరు-మన బడి’
పనుల వేగం పెంచాలి
పాఠశాలల పున:ప్రారంభానికి సిద్ధంగా ఉండాలి
అధికారులతో అదనపు కలెక్టర్ రాజర్షి షా
సంగారెడ్డి కలెక్టరేట్, మే 6: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ పనుల వేగాన్ని పెంచాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో పాఠశాల సముదాయ కమిటీ చైర్మన్లు, సంబంధిత శాఖల ఇంజినీర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ‘మన ఊరు-మన బడి’ కింద జిల్లాలో 441 పాఠశాలలను మొదటి విడతలో ఎంపిక చేశామని, ఇప్పటికే 275 పాఠశాలలకు పరిపాలనా పరమైన అనుమతులను ఇచ్చామన్నారు. అందులో రూ.30 లక్షలలోపు అంచనా గల 249 పాఠశాలలున్నాయని, వాటిలో 60 పాఠశాలలకు సంబంధించిన గ్రౌండింగ్ పూర్తయిందని వెల్లడించారు. గ్రౌండ్ అయిన పాఠశాలలకు 9 శాతం నిధులను పాఠశాల నిర్వహణ కమిటీల ఖాతాలకు బదలాయించామన్నారు. సంబంధిత పాఠశాలల్లో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
వారంలో నియోజకవర్గానికి 2 పాఠశాలలు సిద్ధం కావాలి
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కనీసం 2 పాఠశాలలో ఈ నెల 15లోగా అన్ని హంగులతో సిద్ధం చేయాలని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలను అదనపు కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకముందు, చేసిన తరువాత పాఠశాలల ఫొటోలు, వీడియోలు తీసి సోషల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగేలా చూడాలన్నారు. రూ.30 లక్షల లోపు అంచనా గల పాఠశాలల పనులు వేగవంతంగా ఒక నెల లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఉన్నందున పనులను వేగంగా పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలల ప్రారంభం నాటికి అన్ని హంగులతో సిద్ధం చేయాలని సూచించారు. ఆ బాధ్యత పాఠశాల నిర్వహణ కమిటీ అధ్యక్షులు, ప్రధానోపాధ్యాయులదేనని స్పష్టం చేశారు. పరిపాలన అనుమతులు మంజూరు చేసిన పాఠశాలల ఎంవోయూ, రిజల్యూషన్స్ శనివారం లోగా పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం పాఠశాల వారీగా ఎస్ఎంసీ కమిటీ అధ్యక్షులు, ప్రధానోపాధ్యాయులు, ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో ఆయా పాఠశాలలో చేపట్టిన పనులు, పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ ఈఈలు, డీఈలు, ఏఈలు, ఎంఈవోలు, ఎస్ఎంసీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.