సిద్దిపేట, మే 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పాలనలో గ్రామసీమలు సమస్యలతో సతమతమవుతున్నాయి. నిధులు రాక, పాలకవర్గాలు లేక గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడింది. పాలన అస్తవ్యస్తంగా సాగుతున్నది. ప్రత్యేకాధికారులు పాలనలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారులు ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదు. పూర్తి భారం పంచాయతీ కార్యదర్శులపైనే పడుతున్నది. ప్రభుత్వం నుంచి రూపాయి నిధులు రాకపోవడంతో సమస్యలను గ్రామ పంచాయతీ కార్యదర్శులు పరిష్కరించలేక పోతున్నారు.
దీంతో వారిని గ్రామస్తులు తిట్టి పోస్తున్నారు. దీనిని భరించలేక పంచాయతీ కార్యదర్శులు కొందరు అప్పులు చేసి పలు పనులు చేపట్టారు. వాటికి సంబంధించి బిల్లులు రాక పంచాయతీ కార్యదర్శులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ కార్యదర్శులపై ఉన్నతాధికారుల ఒత్తిళ్లు పెరిగాయి. ఎంపీవో, ఎంపీడీవో, డీఎల్పీవోల వేధింపులు రోజురోజుకూ తీవ్రం అవుతున్నాయని కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. ఫీల్డ్‌కు అధికారులు వచ్చారంటే ఎంతోకొంత సమర్పించుకోకపోతే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
ప్రభుత్వం నుంచి నిధులు రాక చిన్న చిన్న సమస్యలను పరిష్కరించలేక పోతున్నామని గ్రామ పంచాయతీల కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలను శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులకు వేతనాలు సమయానికి రాక పస్తులు ఉంటున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిధులను ఆపేసింది. పాలక వర్గాలు లేక పోవడంతో గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు, గ్రాంట్లు జీపీలకు రావడం లేదు. కేవలం పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే నెట్టుకొస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 499, మెదక్ జిల్లాలో 469, సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు, ఉమ్మడి మెదక్ జిల్లాలో 1615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల నూతన గ్రామ పంచాయతీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
సిద్దిపేట జిల్లాలో 508 పంచాయతీలు, 4508 వార్డులు, మెదక్ జిల్లాలో 492 పంచాయతీలు 4220 వార్డులు, సంగారెడ్డి జిల్లాలో 633 పంచాయతీలు, 5558 వార్డులు ఉన్నా యి). బీఆర్ఎస్ హయాంలో ప్రతినెలా పల్లెప్రగతి నిధులు విడుదల చేయడంతో పల్లెలు కళకళలాడాయి. ప్రస్తుతం పల్లెలు కళావిహీనం గా మారాయి. ఇంటింటా చెత్త సేకరణ, హారితహారం చెట్లకు నీరు పెట్టడం కోసం ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి నిధులు లేక ఆ ట్రాక్టర్లను మూలనపడేయగా, హరితహారంలో నాటిన మొక్కలు పూర్తిగా ఎండిపోయాయి. నర్సరీలు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. గ్రామాలు చెత్తాచెదారంతో నిండి కంపుకొడుతున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని గ్రామాలు పల్లెప్రగతి ద్వారా అద్భుత ప్రగతి సాధించాయి. జిల్లాలోని అన్ని గ్రామాలు పరోగతి దశలో ఉండేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేసి గ్రామాలను అభివృద్ధి చేసింది. పల్లె ప్రగతిలో ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ప్రతినెలా గ్రామాలకు నిధులు అందించింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రతినెలా రూ.30 కోట్ల పైచిలుకు నిధులు వచ్చాయి. ఈ నిధులతో గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దారు.
పల్లె ప్రగతి కింద ముమ్మరంగా పనులు చేపట్టారు. ఫలితంగా గ్రామాలు స్వచ్ఛంగా, ఆహ్లాదంగా మారాయి. ఆరోగ్య గ్రామాలుగా ఫరిఢవిల్లాయి. ప్రతి ఊరికి డంపింగ్ యార్డు, హరితహారంలో విరివిగా మొక్కలు నాటించారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ను కొనిచ్చారు. తాగునీటి సమస్య లేకుండా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మిషన్ భగీరథ నీటిని అందించారు. పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు ఏర్పాటు చేశారు. దీంతో జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అనేక గ్రామా లకు అవార్డులు వరించాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో గ్రామాల పరిస్థితి తారుమారైంది.